
హైదరాబాద్, వెలుగు: తాడిచెర్ల బొగ్గు గనుల ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేసి వాటిని సింగరేణికి అప్పజెప్పాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాడిచెర్ల గనులను జెన్కో ద్వారా ఏఎంఆర్ కంపెనీకి కట్టబెట్టారని, ఇందులో కేసీఆర్కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉందన్నారు. గుట్టుచప్పుడు కాకుండా 30 ఏండ్లపాటు ఈ కంపెనీకి అప్పజెప్పారని, ఇది వేల కోట్ల స్కామ్అని ఆరోపించారు.
రాష్ట్రంలో 4 బొగ్గు గనులను కేంద్రం ప్రైవేటీకరిస్తోందని టీఆర్ఎస్ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. నిజానికి సింగరేణిలో ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం ఉండాలన్నారు. తాడిచెర్ల గనుల కేటాయింపును రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంటుందన్నారు. వెంటనే ఆ పని చేయాలని కోరారు. ఒకవేళ బీజేపీ ఈ అంశంపై స్పందించకపోతే రెండు పార్టీలు ఒకటేనని మరో సారి రుజువవుతుందన్నారు. తాడిచెర్ల బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి జరిగిందని తెలుస్తోందని, దీనిపై సీబీఐ, ఈడీ, బొగ్గు శాఖకు లేఖల ద్వారా ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు.