V6 News

తెలంగాణను అవమానిస్తే ఊరుకోం : మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణను అవమానిస్తే ఊరుకోం : మంత్రి పొన్నం ప్రభాకర్
  • బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలను రికార్డుల నుంచి తొలగించాలి

మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు: తెలంగాణను అవమానిస్తే ఊరుకోమని మంత్రి పొన్నం ప్రభాకర్​ హెచ్చరించారు. మహబూబ్​నగర్​ డీసీసీ ఆఫీస్​లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్​ సమావేశాల్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. స్వరాష్ట్రం గురించి ఆయన హేళన చేసి మాట్లాడుతుంటే తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఎందుకు దీనిని ఖండించలేదని ప్రశ్నించారు. అమరుల త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పాటైందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఆర్టికల్–3 ద్వారా లోక్​సభ, రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాసై, రాష్ట్రపతి ఆమోదంతో స్వరాష్ట్రం సిద్ధించిందన్నారు. అలాంటి తెలంగాణ గురించి మాట్లాడిన మాటలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు.

ఈ బాధ్యతను కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ తీసుకోవాలన్నారు. డీలిమిటేషన్​ బిల్లును మహిళా బిల్లుతో లింక్​ పెట్టడంతోనే ఆ బిల్లు వీగిపోయిందన్నారు. 46 ఏండ్లుగా బీజేపీ ఒక్క మహిళను కూడా ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా నియమించలేదన్నారు. మహిళా రిజర్వేషన్​ బిల్లుకు కాంగ్రెస్​ కట్టుబడి ఉందన్నారు. మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలను సబ్​ కోటా ఉండాలని డిమాండ్​ చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, జి.మధుసూదన్​ రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్​ కార్పొరేషన్​ చైర్మన్​ ఒబేదుల్లా కొత్వాల్, నగర మేయర్​ మమత, డిప్యూటీ మేయర్​ మారేపల్లి సురేందర్​ రెడ్డి, ముడా చైర్మన్​ లక్ష్మణ్​యాదవ్, లైబ్రరీ చైర్మన్​ నర్సింహారెడ్డి, ఏఎంసీ చైర్​పర్సన్​ బెక్కరి అనిత పాల్గొన్నారు.