
సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దళితులకి, బలహీనవర్గాలకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుందన్నారు. బలహీన వర్గాల ముఖ్యమంత్రి అని ప్రకటించిన బీజేపీ కనీసం శాసనసభ నాయకత్వం ఇవ్వలేకపోయిందని విమర్శించారు. బలహీన వర్గానికి చెందిన బండిసంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అకారణంగా తొలగించిందన్నారు.
బీజేపీ బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమని విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని అన్నారు పొన్నం. రిజర్వేషన్ల తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్తామని చెప్పారు. కులగణనకి అనుకూలంగా కాంగ్రెస్ ముగ్గురికి మంత్రి పదవులు , ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చిందన్నారు. రిజర్వేషన్ లకి వ్యతిరేకంగా పోరాడిన కరుడుగట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రాంచంద్రరావుకి బీజేపి అధ్యక్ష పదవి కట్టబెట్టిందని ఆరోపించారు. రిజర్వేషన్లపై తమను ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులు ముందుగా వారి అలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.
కిషన్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసి అరవింద్, లక్ష్మణ్, ఈటెల రాజేందర్, అర్ కృష్ణయ్య లాంటి బిసిలకి ఇవ్వాలని సూచించారు పొన్నం . రాష్ట్రపతి వద్ద ఉన్న బీసీ రిజర్వేషన్లకు బీజేపి సహాకరించాలని పొన్నం చెప్పారు.