కాశీకి రూ.5వేల కోట్లు ఇచ్చి.. దక్షిణ కాశీ ఎములాడకు ఎందుకియ్యలే ?

కాశీకి రూ.5వేల కోట్లు ఇచ్చి.. దక్షిణ కాశీ ఎములాడకు ఎందుకియ్యలే ?
  • రాజన్నకి కోడె తేలే.. కోటి రూపాయలు ఇయ్యలే..
  • ప్రధాని మోదీపై మంత్రి పొన్నం ఫైర్
  • వేములవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

వేములవాడ/చందుర్తి, వెలుగు :  ‘కాశీకి రూ.5 వేల కోట్టి పెట్టి డెవలప్ చేసినవ్..దక్షిణ కాశీ వేములవాడ రాజన్నకు కోటి రూపాయలు కూడా ఎందుకు ప్రకటించలే.. కనీసం రాజన్న ఆలయ అభివృద్ధి గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేకపోతివి’ అంటూ ప్రధాని మోదీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ కాంగ్రెస్​అభ్యర్థి రాజేందర్ రావుకు మద్దతుగా వేములవాడలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ ‘సంజయ్ నియోజకవర్గానికి ఏం చేయకనే మళ్లీ గెలిచే నమ్మకం లేక ప్రధానిని రప్పించిండు. 

సహజంగా ఎక్కడైతే వీక్​గా ఉంటారో అక్కడే ఎక్కువగా ప్రచారం చేస్తారు’ అని అన్నారు. ‘ప్రధాని మా రాజన్నను దర్శించుకుంటున్నడంటే ఎంతో అశపడ్డాం..ఆలయ అభివృద్ధి గురించి మాట్లాడుతాడని చూశాం. కానీ, అవేవీ లేకుండా కేవలం రాజకీయ పర్యటన కోసమే వచ్చిండు’ అని అన్నారు. రాష్ర్టంలో అత్యధికంగా భక్తులు దర్శించుకునే రాజన్న గుడికి కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని, గాడిద గుడ్డు ఇచ్చారన్నారు. పదేండ్లలో మోదీకి దక్షిణ కాశీ వేములవాడ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. జోగులాంబకి కేంద్రం నిధులు వచ్చాయని, కానీ, వేములవాడ రాజన్నకి నిధులు ఇప్పించలేని అసమర్థుడు బండి సంజయ్​అని అన్నారు. విప్ అది శ్రీనివాస్, అభ్యర్థి రాజేందర్​రావుతో కలిసి రాజన్నను దర్శించుకున్నారు.