వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా: మంత్రి పొన్నం

వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా: మంత్రి పొన్నం

గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ కులాలకు ఆర్భాట ప్రకటనలు తప్ప... ఒరగబెట్టింది ఏమి లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ కులాల సంక్షేమ భవనాలు, ఫెడరేషన్ లకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని... పైన పటారం, లోన లొటారం అనే చందంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన... వడ్డెర ఆత్మగౌరవ సభలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ , కర్ణాటక రాష్ట్ర  మంత్రి మహాదేవప్ప,  జగద్గురువు శ్రీ ఇమ్మడి సిద్ధ రామేశ్వర స్వామీజీలతో కలిసి మంత్రి పొన్నం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... రాష్ట్ర ఖాజానను బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ చేసి పోయిందని... ఇప్పుడు ఉన్న ఆర్ధిక పరిస్థితిపై శ్వేతా పత్రం విడుదల చేసిన విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని.. అయితే నిధులు లేకుండా ఫెడరేషన్ ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉండదని చెప్పారు. వచ్చే ఏడాది వరకు బడ్జెట్ కేటాయించి, వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. మైనింగ్ లలో వడ్డెరలకు 20శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారని.. ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. 

ఇతర రాష్ట్రాలతో ఎస్టీలుగా ఉన్న వడ్డెరల.. తెలంగాణలో మాత్రం బీసీలుగా కొనసాగుతున్నారని.. వారిని ఎస్టీలలో చేర్చాలంటే చట్టసవరణలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ దిశగా వడ్డెరలు ఐక్యంగా ఉద్యమించాలని మంత్రి పొన్నం సూచించారు.