
స్టార్ హీరోయిన్ అవ్వడం ఎంత కష్టమో, ఆ స్టార్‌డమ్‌ని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం. అయితే పూజాహెగ్డేకి వస్తున్న అవకాశాల్ని చూస్తుంటే మరికొన్నేళ్ల పాటు ఆమె కెరీర్‌కి ఢోకా లేదనిపిస్తోంది. ప్రస్తుతం ‘బీస్ట్’ షూటింగ్‌లో పాల్గొంటోంది పూజ. చెన్నైలోని ఓ స్టూడియోలో విజయ్, పూజలపై మాస్ మసాలా సాంగ్‌ని తీస్తున్నారట. నవంబర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఇది కాక పూజ నటించిన నాలుగు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఆమె అకౌంట్‌కి కొన్ని కొత్త సినిమాలు కూడా యాడ్ అయ్యినట్లు తెలుస్తోంది. వాటిలో మహేష్ హీరోగా త్రివిక్రమ్ తీయనున్న మూవీతో పాటు పవన్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించే సిని మాలోనూ పూజ పేరు వినిపిస్తోంది. ఇటీవల వీటి విషయంలో ఓ ఇంటరెస్టింగ్ అనాలసిస్ బైటికొచ్చింది. పై రెండూ మహేష్, పవన్‌ల కెరీర్లో ఇరవై ఎనిమిదో సినిమాలు. పూజ నటించిన ‘అరవింద సమేత’ కూడా ఎన్టీఆర్‌కి ఇరవై ఎనిమిదో సినిమానే. గతంలో భూమిక విషయంలోనూ ఇలా జరిగింది. ఈ ముగ్గురు హీరోల ఏడో సినిమాలో ఆమే హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు పూజ కూడా అలాంటి రికార్డునే క్రియేట్ చేస్తోందని, ఆమె డిమాండ్ ఆ రేంజ్‌లో ఉందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు ఫ్యాన్స్. కాకపోతే మహేష్, పవన్‌ల సినిమాల్లో హీరోయిన్‌గా పూజ పేరును ఇంకా అనౌన్స్ చేయలేదు. చేస్తే కనుక అభిమానుల అంచనా నిజమైనట్టే.