మహాత్మ జ్యోతీరావు పూలే..బడుగులకు చదువునిచ్చిన మహనీయుడు

మహాత్మ జ్యోతీరావు పూలే..బడుగులకు చదువునిచ్చిన మహనీయుడు

సమాజంలోని అసమానతలు రూపుమాపి అట్టడుగు వర్గాల వారికీ విద్యనందించిన మహనీయుడు మహాత్మ జ్యోతీరావు పూలే అని మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. శనివారం రవీంద్రభారతిలో లక్ష్యసాధన ఫౌండేషన్​ ఆధ్వర్యంలో వివిధ రంగాల వారికి జ్యోతీరావు పూలే అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్​, శ్రీనివాస్​గౌడ్​ హాజరయ్యారు. తొలి సాంఘిక విప్లవకారుడు జ్యోతీరావు పూలే అని ఈటల అన్నారు. బడుగు బలహీన వర్గాల్లో పుట్టి వివిధ రంగాల్లో సేవ చేస్తూ ప్రతిభ కనబరిచిన వాళ్లకు ఏటా అవార్డులను ఇవ్వడం సంతోషమన్నారు. మనిషికి కావాల్సింది విద్య అని, ఆ అవసరాన్ని గుర్తించి మొట్టమొదటిసారి పాఠశాలలను ప్రారంభించి కోట్లాది మందికి ఆయన ఆదర్శమయ్యారని అన్నారు. ఆయనే స్ఫూర్తిగా నేడు రాష్ట్రంలో 250కి పైగా బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామన్నారు. అంతేగాకుండా బలహీన వర్గాల వారికి అత్యున్నతమైన విద్యను అందించేందుకు పూలే ఓవర్సీస్​ స్కాలర్​షిప్​ల పేరిట 20 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వందల ఏళ్లుగా బడుగు బలహీన వర్గాలు ఎంతో గోసపడ్డారని, వృత్తులు లేక ఉపాధి కరువై ఎన్నో ఇబ్బందులు పడ్డారని శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వెనకబాటుతనాన్ని పారదోలి బీసీల భవిష్యత్​ను చక్కదిద్దే ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మార్కెట్​ కమిటీలో తొలిసారిగా బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. ట్యాంక్​బండ్​పై పూలే  విగ్రహం పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​ డిమాండ్​ చేశారు. . జేఎన్టీయూ రిజిస్ట్రార్​ ప్రొఫెసర్​ యాదయ్య, పాటల రచయిత అశోక్​ తేజ, సినీ నటుడు ఆర్​ నారాయణమూర్తి, మాజీ అడ్వొకేట్ జనరల్​ కేజీ కృష్ణమూర్తి, డాక్టర్​ విజయ భాస్కర్,​ సుధగాని హరీశ్​ శంకర్​, గడీల శ్రీకాంత్​లకు పూలే అవార్డులను అందజేశారు.