హోటల్స్​, రెస్టారెంట్లలో నాణ్యత లేని ఫుడ్​

హోటల్స్​, రెస్టారెంట్లలో నాణ్యత లేని ఫుడ్​
  • ఫుడ్​ ఇన్​స్పెక్టర్లు పోతలె.. తనిఖీలు చేస్తలె!
  • బల్దియాకు  రోజూ 15 నుంచి 20 వరకు ఫిర్యాదులు 
  • నాసిరకం  నూనె వాడకం
  • 90 శాతం వరకు స్ట్రీట్ ​ఫుడ్​సెంటర్లలోనే వినియోగం 

బంజారాహిల్స్​లోని భీమాస్​ హోటల్లో ఫుడ్​ క్వాలిటీ లేదంటూ సిటిజన్​మహ్మద్​ అమీర్ ​కొద్దిరోజుల కిందట మంత్రి కేటీఆర్, ఖైరతాబాద్​ జోనల్​కమిషనర్ కు ట్విట్టర్ లో ఫొటో సహా పోస్ట్​ చేసిండు. ఇడ్లి ఆర్డర్ చేస్తే అందులో బొద్దింక వచ్చిందని, హోటల్​పై చర్యలు తీసుకుని పబ్లిక్ ​హెల్త్​కాపాడాలని కోరిండు.’’

జొమాటో ద్వారా ఆన్​లైన్​లో  ఫుడ్​ఆర్డర్​ చేశా. డెలివరీ అయ్యాక ప్యాకెట్​విప్పి చూస్తే ఫుడ్ వాసన వచ్చింది. ఆ రెస్టారెంట్ ని జొమాటో నుంచి తొలగించాలంటూ గత నెలలో సోషల్ ​మీడియా లో సిటిజన్​ వినోద్ పోస్ట్​ చేసిండు.’’

హైదరాబాద్, వెలుగు: సిటీలో హోటల్స్, రెస్టారెంట్స్​, స్ర్టీట్ ఫుడ్ సెంటర్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన బల్దియా పెద్దగా పట్టించుకోవడంలేదు. కస్టమర్లు కంప్లయింట్లు చేస్తుంటేనే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెకింగ్ లు ఎలా చేస్తున్నరనేది స్పష్టమవుతుంది. హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్​​టేస్ట్ బాగా లేదని, నాణ్యత ఉండట్లేదని, పాడైన ఫుడ్​ సర్వ్​ చేస్తున్నారంటూ  మై జీహెచ్ఎంసీ యాప్, హెల్ప్​ లైన్ నంబర్, డయల్100, ట్విట్టర్​తో పాటు ఫుడ్ ఇన్​స్పెక్టర్లకు డైలీ 15 నుంచి 20 వరకు  ఫిర్యాదులు అందుతున్నాయి. మూడు  నెలల్లోనే దాదాపు 280 పైగావచ్చాయి. ఫిర్యాదులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆయా ప్రాంతాల్లోనే ఫుడ్​ ఇన్​స్పెక్టర్లు హడావుడి చేస్తూ శాంపిల్స్​తీసుకుని పక్కన పడేస్తున్నారు. సిటీ అంతటా ఫోకస్ పెట్టడంలేదు. బల్దియా ఫుడ్​సేఫ్టీ వింగ్​లో ప్రస్తుతం 21 మంది ఆఫీసర్లు ఉన్నా  పరిస్థితి లో మార్పు లేదు. అమ్మకాలు తక్కువగా ఉన్న కొన్ని హోటల్స్​ నిర్వాహకులు ఆన్​లైన్ ​ఆర్డర్లకు రాత్రిపూట మిగిలిన ఫుడ్​ని మరుసటి రోజు వేడి చేసి పంపుతున్నారన్న ఆరోపణలున్నా నిర్లక్ష్యంగా ఉంటున్నారు.  ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో ఫుడ్ త్వరగా పాడయ్యే అవకాశముంది. 

ఆన్​లైన్ లో ఆర్డర్ చేస్తే..
 హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్​ ఫుడ్​ తినే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఫ్రెండ్స్​, ఫ్యామిలీస్​తో వెళ్లి తింటుంటారు. మరికొందరు ఆన్ లైన్​లో ఫుడ్​ఆర్డర్ చేస్తుంటారు. కొన్ని హోటల్స్​, రెస్టారెంట్లు నాన్​వెజ్ ​మిగిలితే మరుసటి రోజు వాడుతున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే  ఆర్డర్​ చేసిన కస్టమర్​కు పంపిస్తుండగా టేస్ట్​ చేంజ్​అవుతోంది. ఆన్​లైన్ ​ఆర్డర్​లో ఎవరు చూస్తారంటూ కొందరు పంపుతుండగా ఫుడ్​ టేస్ట్​గా ఉండకపోతుండగా, ఆన్​లైన్ ఫుడ్ బుకింగ్​ చేసుకునే వారు కూడా  బయటకు వెళ్లి  తింటున్నట్లు చెబుతున్నారు.  

సూపర్ మార్కెట్లలో తనిఖీల్లేవ్​..
 సూపర్​  మార్కెట్లలో తనిఖీలు చేయాల్సిన ఆఫీసర్లు పట్టించుకోవడంలేదు.  ఆఫర్ పెట్టే వస్తువుల క్వాలిటీని అంతగాపట్టించుకోవడంలేదు. ఇవి కాకుండా అమ్మకాలు తక్కువగా ఉన్న మెటిరియల్​ని కూడా సూపర్​మార్కెట్ల నిర్వాహకులు ఎప్పటికప్పుడు స్టాక్​ ఎలా ఉందని చూడడం లేదు. దీంతో కొన్ని వస్తువులు కొనుగోలు చేసి తినే సమయంలో పాడవుతున్నాయి. ఈ విషయంపై ఫుడ్ ​ఇన్​స్పెక్టర్లకు కంప్లయింట్స్​వచ్చినా కూడా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రష్యా-– ఉక్రెయిన్​ మధ్య యుద్ధం కారణంగా  ప్రస్తుతం లీటర్ ​మంచి నూనె ధర రూ.250 దాటింది. నాణ్యతలేని నూనెలను వాడుతున్నట్టు తెలుస్తోంది. స్ర్టీట్​ఫుడ్ ​సెంటర్లలో అయితే 90 శాతం వరకు నాసిరకం నూనెలనే వినియోగిస్తున్నారు. కస్టమర్లు అడిగితే ధరలు పెరిగితే ఏం చేస్తామని సమాధానం ఇస్తున్నారు. 

స్పెషల్ డ్రైవ్ ​చేస్తున్నం.. బల్దియా ఫుడ్​ ఇన్​స్పెక్టర్
 హోటల్స్​, రెస్టారెంట్లలో వాడే నూనెల నాణ్యతపై స్పెషల్​ డ్రైవ్​ నిర్వహిస్తున్నామని బల్దియాలోని ఓ ఫుడ్​ ఇన్​స్పెక్టర్ ​చెప్పారు. ప్రస్తుతం నూనెల రేట్లు పెరగడంతో నాణ్యతలేనివి వాడుతున్నట్టు తమ దృష్టికి కూడా వచ్చిందని, దీంతో సిటీ అంతటా ఫోకస్ చేసినట్టు తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్లలో రెగ్యులర్​గా శాంపిల్స్​ సేకరించి తగు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 

 వీటిపైనే ఎక్కువగా ఫిర్యాదులు 
హోటల్స్, మెస్​లు, రెస్టారెంట్లు, స్వీట్ షాప్స్​, ఫాస్ట్​ ఫుడ్​సెంటర్లు,  బేకరీల్లోని ఫుడ్​పై బల్దియాకు ఎక్కువగా కంప్లయింట్లు వస్తున్నాయి. ఈ నెలలో వచ్చిన వాటిలో వీటిపైనే ఎక్కువగా ఉన్నాయి. ఫాస్ట్​ ఫుడ్​సెంటర్లలో ఆయిల్ మంచిది వాడటం లేదని,  స్వీట్​ షాప్ లో స్వీట్స్​ తీసుకుంటే వాసన​వస్తున్నాయని, మెస్​లో భోజనం టేస్ట్​గా  లేదని, రెస్టారెంట్లలో చికెన్​  తీసుకెళ్తే బాగాలేదని, కుళ్లిపోయిన ఫుడ్​ని అందిస్తున్నారని జనాల నుంచి ఎక్కువగా ఇలాంటి ఫిర్యాదులు ఉంటున్నాయి. ఆన్​ లైన్​లోను ఆర్డర్​ చేసిన ఫుడ్​, పార్సిల్​ తీసుకెళ్లినా రుచిగా ఉండటం లేదంటూ ఫొటోలను తీసి కంప్లయింట్ చేస్తున్నారు.