
జపాన్ అధికారికంగా దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుఎంజా మహమ్మారిని ప్రకటించింది. జపాన్‌లో ఫ్లూ సీజన్ సాధారణంగా నవంబర్ చివరిలో ప్రారంభమై మార్చి వరకు కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ చివరిలోనే కేసులు బాగా పెరిగాయి. దింతో అక్టోబర్ 3న జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిని "జాతీయ అంటువ్యాధి"గా ప్రకటించింది.
ఈ అంటు వ్యాధులను పర్యవేక్షించడానికి జపాన్ దాదాపు 3 వేల –5 వేల ఆసుపత్రుల నుండి వారానికి ఒకసారి డేటాను సేకరిస్తుంది. ఏదైనా అంటు వ్యాధి వల్ల రోగుల సగటు కంటే ఎక్కువగా ఉంటే, దానిని అంటువ్యాధిగా పరిగణిస్తారు. ఇది 1999 నుండి అమలులో ఉంది. సెప్టెంబర్ 22 నుండి 28 మధ్య, జపాన్ అంతటా 4 వేల మందికి పైగా ఫ్లూ బారిన పడ్డారు. ఈ అంటువ్యాధి పరిమితిని మించిపోయింది. సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 5 మధ్య ఫ్లూ రోగుల సంఖ్య 6వేల కంటే పెరిగింది.
జపాన్‌లోని 47 ప్రిఫెక్చర్లలో 28 ప్రాంతాలలో ఫ్లూ కేసులు పెరిగాయి. ఒకినావా, టోక్యో, కగోషిమా ఎక్కువగా ప్రభావం కాగా.... చాల స్కూల్స్, పిల్లల సంరక్షణ కేంద్రాలు తాత్కాలికంగా మూసేసారు. ఈ సీజన్‌లో ఫ్లూ మరణాలపై ఇంకా అధికారిక లెక్కలు లేవు. అయితే, 2023–24లో జపాన్‌లో ఈ ఇన్‌ఫ్లుఎంజా కారణంగా 1,383 మంది మరణించారు.
ఇతర దేశాలకు వ్యాపిస్తుందా: జపాన్ కాకుండా భారతదేశం, సింగపూర్, థాయిలాండ్, మలేషియాలో కూడా కేసులు పెరిగాయి. భారతదేశంలో ఈ ఫ్లూ సీజన్ జనవరి-మార్చి అలాగే ఆగస్టు-అక్టోబర్ మధ్య వస్తుంది. ఈ ఏడాది ఢిల్లీ, హర్యానా, పంజాబ్, గుజరాత్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో ఫ్లూ జాతి H3N2 జపాన్ వేరియంట్ లాంటిదే.
'లోకల్ సర్కిల్స్' నిర్వహించిన సర్వే ప్రకారం, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్ అంతటా 69% కుటుంబాలలో కనీసం ఒక వ్యక్తికి ఫ్లూ లేదా జ్వరం లాంటి లక్షణాలు ఉన్నట్లు నివేదించాయి. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, జనవరి నుండి సెప్టెంబర్ 2025 మధ్య, ఒక లక్ష సాంపుల్స్ పరీక్షించారు, వాటిలో దాదాపు 25% H3N2 పాజిటివ్‌గా తేలింది.
ఈ సంవత్సరం థాయిలాండ్‌లో 550,000 కంటే ఎక్కువ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్ 7 నుండి 13 మధ్య మాత్రమే 30 వేల కంటే ఎక్కువ మంది కొత్త రోగులుగా గుర్తించగా, ఇప్పటివరకు 59 మంది మరణించారు. సింగపూర్‌లో గత రెండు వారాల్లో ఫ్లూ కేసులు 40% పెరిగాయి, ఎక్కువగా సాధారణ జలుబు (రైనోవైరస్), ఇన్‌ఫ్లుఎంజా. చాలా ఇన్‌ఫెక్షన్లు తేలికపాటివని ఆరోగ్య అధికారులు గుర్తించారు. మలేషియాలో 6వేల మందికి పైగా విద్యార్థులకు ఫ్లూ పాజిటివ్ రావడంతో స్కూల్స్ తాత్కాలికంగా మూసివేశారు.
ఈ ఫ్లూకు ఏ వైరస్ కారణం, లక్షణాలు ఏంటి : జపాన్, భారతదేశం, సింగపూర్ వంటి దేశాలు ఇన్ఫ్లుఎంజా టైప్ A వైరస్‌లు - H1N1 & H3N2 కేసులను నివేదిస్తున్నాయి. సాధారణంగా, జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలను మనం "ఫ్లూ" అని పిలుస్తాము, అయితే పూర్తి పదం "ఇన్ఫ్లుఎంజా". నాలుగు రకాల ఇన్ఫ్లుఎంజా వైరస్‌లు ఉన్నాయి A, B, C ఇంకా D.
ఇన్ఫ్లుఎంజా A వైరస్‌లు అత్యంత తీవ్రమైనవి, ఇవి మనుషులకు, పక్షులకి వ్యాపిస్తాయి. అలాగే కరోనా మహమ్మారిని ప్రేరేపించే అవకాశం ఉంది. H1N1, H3N2, H5N1 ఈ కోవకు చెందినవి. H1N1ని "స్వైన్ ఫ్లూ" అని, H3N2ని "హాంకాంగ్ ఫ్లూ" అని, H5N1ని "బర్డ్ ఫ్లూ" అని పిలుస్తారు. ఇతర ఇన్ఫ్లుఎంజా రకాలు (బి, సి & డి) సీజనల్ జలుబు లేదా దగ్గు వంటి తేలికపాటి లక్షణాలను కలిగిస్తాయి కానీ అరుదుగా అంటువ్యాధులకు దారితీస్తాయి. అయితే, టైప్ ఎ వైరస్‌లు కరోనావైరస్ లాగే వేగంగా వ్యాపిస్తాయి.
పిల్లలకు H1N1 , వృద్ధులకు H3N2 ప్రమాదకరం: H1N1 & H3N2, ఈ రెండూ టైప్ A ఇన్ఫ్లుఎంజా వైరస్‌లు, ఇతర ఇన్ఫ్లుఎంజా వైరస్ లాగానే లక్షణాలను ఉంటాయి.
మొదటి లక్షణాలు పిల్లలలో సీజనల్ జలుబు, దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పి, చికాకు, తలనొప్పి, వాంతులు లేదా విరేచనాలు. తీవ్రమైన లక్షణాలు చూస్తే నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజులపాటు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియా, పిల్లలలో వాంతులు. ఇతర ఇన్ఫ్లుఎంజా రకాలతో పోలిస్తే, H1N1 & H3N2 వేగంగా వ్యాప్తి చెందుతాయి అలాగే అంటువ్యాధులకు కారణమవుతాయి. H1N1 పిల్లలు,పెద్దలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది, అయితే H3N2 వృద్ధులను లేదా ఇప్పటికే అనారోగ్య పరిస్థితులు ఉన్నవారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఈ వైరస్‌లు ప్రాణాంతకం అవుతాయా: 1957లో, H2N2 వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఫ్లూ మహమ్మారిని కలిగించింది, దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా 1.1 మిలియన్ల మంది మరణించారు సమాచారం ప్రకారం, ఒక్క అమెరికాలోనే లక్ష మందికి పైగా మరణించారు. జూలై 1968లో H3N2 వైరస్ పక్షుల నుండి మానవులకు వేగంగా వ్యాపించింది. ఆరు వారాల్లోనే, హాంకాంగ్‌లో 5లక్షల మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. తరువాతి నాలుగు సంవత్సరాలలో, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దీని బారిన పడ్డారు. దీని వల్ల పది లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.
అదేవిధంగా మార్చి 2009లో H1N1 వైరస్ అమెరికాలో స్వైన్ ఫ్లూకు కారణమైంది, ఇది 21వ శతాబ్దంలో మొట్టమొదటి ఇన్ఫ్లుఎంజా మహమ్మారి. ఒక సంవత్సరంలోపు దాదాపు 280,000 మందిని చంపింది. టీకా వేసిన తర్వాత, స్వైన్ ఫ్లూ తీవ్రత తగ్గింది. నేడు దీనిని 0.1% మరణాల రేటుతో సీజనల్ అనారోగ్యంగా పరిగణిస్తున్నారు. అదే టీకాను H3N2 ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. జపాన్‌లో ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఫ్లూలో H1N1, H3N2 కొత్త రకాలు ఉండవచ్చునని, నియంత్రించకపోతే ప్రమాదకరంగా మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఈ వైరస్ ఎందుకు ఇంత వేగంగా వ్యాపిస్తోంది: సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ కింబర్లీ ఫోర్న్స్ ప్రకారం చల్లని ప్రాంతాలలో, ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఫ్లూ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. శీతాకాలంలో ప్రజలు ఇంటి లోపల ఎక్కువ సమయం గడుపుతారు, దీనివల్ల వైరస్లు వ్యాప్తి చెందడం సులభం అవుతుంది అని అన్నారు.
వర్షాకాలంలో తేమ, ఇరుకైన ప్రదేశాలు కూడా ఇన్ఫెక్షన్లను పెంచుతాయని వైద్యులు అంటున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలు ఫ్లూ వ్యాప్తి ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ఫ్లూ వ్యాప్తి కొద్దిగా తగ్గవచ్చని సైన్స్ జర్నలిస్ట్ కై కుప్ఫెర్ష్మిత్ సైన్స్ మ్యాగజైన్‌తో అన్నారు. కానీ వాతావరణ మార్పుల కారణంగా, భవిష్యత్తులో ఇన్ఫ్లుఎంజా వైరస్‌లు ఏడాది పొడవునా ఉండవచ్చని హెచ్చరించారు.
H3N2 వైరస్ నుండి ఎలా రక్షించుకోవచ్చు: డాక్టర్లు సూచించిన వయస్సులోని పిల్లలకు ఇన్ఫ్లుఎంజా & జపనీస్ ఎన్సెఫాలిటిస్ టీకాలు వేయించాలి. పరిశుభ్రత పాటిస్తూ.. సబ్బు లేదా నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి లేదా శానిటైజర్ వాడాలి. గాలి ద్వారా వ్యాపించకుండా ఉండటానికి రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించండి. మీకు వైరస్ లక్షణాలు కనిపిస్తే దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మాస్క్ ధరించండి అలాగే సామజిక దూరం పాటించండి. ఈ చర్యలు ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫార్సు చేస్తున్నాయి. మీకు లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్ల సలహా తీసుకోండి.