
పాట్నా: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను జేడీయూ ప్రకటించింది. 57 మంది అభ్యర్థులకు ఫస్ట్ లిస్ట్‌లో చోటు కల్పించింది. జేడీయూ సీనియర్ లీడర్స్ అనంత్ సింగ్, శ్యామ్ రాజక్, విజయ్ చౌదరి తొలి జాబితాలోనే టికెట్ దక్కించుకున్నారు. సోన్‌బర్సా నుంచి రత్నేష్ సదా, మోర్వా నుంచి విద్యాసాగర్ నిషాద్, ఎక్మా నుంచి ధుమల్ సింగ్, రాజ్‌గిర్ నుంచి కౌశల్ కిషోర్ బరిలోకి దిగనున్నారు.
ఇదిలా ఉంటే.. జేడీయూ ప్రకటించిన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ అధికార ఎన్డీఏ కూటమిలో చిచ్చురేపింది. పొత్తులో భాగంగా కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) కోరుతున్న నాలుగు స్థానాలకు జేడీయూ నేరుగా అభ్యర్థులను ప్రకటించింది. జేడీయూ నిర్ణయం ఎన్డీఏ కూటమిలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. సీఎం నితీష్ కుమార్ నిర్ణయంపై చిరాగ్ పాశ్వాన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
కాగా, ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు సీట్ల పంపకాల్లో భాగంగా మొత్తం 243 స్థానాలకు గానూ బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్లు, ఉపేంద్ర కుశ్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తాన్ అవామ్ మోర్చా(హెచ్ఏఎం)లకు చెరో 6 సీట్ల చొప్పున కేటాయించారు.
అలాగే, లోక్ జన్ శక్తి పార్టీ (రామ్ విలాస్) కి 29 సీట్లు దక్కాయి. కాగా, మొత్తం బీహార్ లోని 243 స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6న తొలి దశ, నవంబర్ 11న సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.