జగిత్యాలలో వింత ఘటన.. చచ్చిపోయాడని Miss you, RIP స్టేటస్లు.. బాడీని పాడె ఎక్కిస్తుండగా..

జగిత్యాలలో వింత ఘటన.. చచ్చిపోయాడని Miss you, RIP స్టేటస్లు.. బాడీని పాడె ఎక్కిస్తుండగా..

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం శాఖాపూర్ గ్రామంలో వింత ఘటన జరిగింది. చనిపోయాడనుకున్న వ్యక్తి.. మూడు గంటల తర్వాత హార్ట్ బీట్ కొట్టుకోవడంతో కుటుంబ సభ్యులు ఊహించని ఈ పరిణామంతో షాకయ్యారు. శాఖపూర్ గ్రామానికి చెందిన తనుగుల శ్రీనివాస్ గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. అతని శరీరంలో అవయవాలు పూర్తిగా దెబ్బ తినడంతో గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచాన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.

రెండు రోజుల క్రితం వైద్యం నిమిత్తం వరంగల్, కరీంనగర్ ఆసుపత్రులకు తీసుకెళ్లి కుటుంబ సభ్యులు మళ్ళీ అతనిని ఇంటికి తీసుకువచ్చారు. దీంతో మళ్ళీ ఇంటి వద్ద అనారోగ్యానికి గురికావడంతో తనుగుల శ్రీనివాస్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో శ్రీనివాస్ చనిపోయాడని భావించి కుటుంబ సభ్యులు దహన సంస్కారాలకు సిద్ధమయ్యారు. కొంతమంది గ్రామస్తులు శ్రీనివాస్ RIP అని వాట్సాప్లో స్టేటస్లు కూడా పెట్టుకున్నారు.

డప్పులు, దహన సంస్కారాల కోసం సామాగ్రి తీసుకొని ఇంటికి వచ్చారు. బాడీని పాడె మీదికి తీసుకువస్తుండగా శ్రీనివాస్పై చెమటలను గుర్తించి హార్ట్ బీట్ చూడగా బ్రతికే ఉన్నాడని నిర్ధారణకు వచ్చారు. వెంటనే డాక్టర్లను పిలిచి చెక్ చేయించగా నాడి కొట్టుకుంటుందని, బ్రతికే ఉన్నాడని డాక్టర్ నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. హుటాహుటిన అతనిని వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ చనిపోయాడని స్టేటస్లు పెట్టిన బంధువులు, సన్నిహితులు ఆ స్టేటస్లను డిలీట్ చేసుకున్నారు.