
ఈరోజుల్లో మసాలాలు ఇంట్లోనే నూరుకునే ఓపిక, టైం ఎక్కడుంది చెప్పండి.. ఏ మసాలా కావాలన్నా వీధిలోనే ఉన్న జనరల్ స్టోర్స్ లో ఈజీగా దొరుకుతున్నాయి. అది కూడా ఐదు రూపాయల ప్యాకెట్ మొదలుకొని.. మనకు కావాల్సిన క్వాంటిటీలో దొరుకుతున్నాయి. అలాంటప్పుడు ఇంట్లో మసాలాలు నూరుకోవాల్సిన అవసరం ఎక్కడుందని ఫీల్ అవుతున్నారు అందరు. మన బద్దకాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది తయారీదారులు. ఇప్పటికే అల్లంవెల్లుల్లి పేస్ట్ దగ్గర నుంచి కోల్గేట్ పేస్ట్ వరకు ప్రతిదీ కల్తీ అవుతోంది. ఇప్పుడు మనం బయట షాపులో కొనే మసాలాలు కూడా భయపెడుతున్నాయి. మంగళవారం ( అక్టోబర్ 14 ) రాష్ట్రవ్యాప్తంగా మసాలా తయారీ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
తెలంగాణ వ్యాప్తంగా మసాలా తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. 30కి పైగా తయారీ, ప్యాకింగ్ సెంటర్లపై నిర్వహించిన ఈ దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మసాలా తయారీ దారులు ఏమాత్రం ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు.
మిరియాలు, మాసాలాల్లో ఎలుకల మలం:
పలు తయారీ కేంద్రాల నుంచి చిల్లి పౌడర్, పసుపు, మిరియాలు, కరివేపాకు పొడి, ధనియాలు సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్ కి పంపించినట్లు తెలిపారు అధికారులు. రంగారెడ్డి జిల్లా జలపల్లి లోని శ్రీవారి స్పైసెస్, బండ్లగూడ జాగీరు లోని డివైన్ స్పైసెస్ లు అపరిశుభ్ర వాతావరణం లో మసాలాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు.
ఓ తయారీ కేంద్రంలో మిరియాలు, ఇతర మసాలాల్లో ఎలుక మలం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు అధికారులు. నిర్వాహకులు అవే మసాలాలు ప్యాకింగ్ చేసి షాప్స్ కి పంపుతున్నారని తెలిపారు అధికారులు.గడువు ముగిసిన, లేబుల్ లేని ప్రొడక్ట్స్ స్టోర్ చేస్తున్నారని.. నిబంధనలు పాటించని మసాలా తయారీ కేంద్రాలకు నోటీసులిచ్చినట్లు తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.