సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ‘ఎక్స్’లో ఒక విషయం మహేష్ బాబు అభిమానులను కలచివేసింది. మహేష్ బాబు అభిమానుల్లో ఒకడైన రాజేష్ అనే యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేష్కు మహేష్ బాబు అంటే విపరీతమైన అభిమానం. ఎంతలా అంటే.. మహేష్ బాబు బొమ్మను గుండెపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అతని ఇంట్లో గోడలపై ఎటు చూసిన మహేష్ బాబు ఫొటోలే కనిపిస్తాయి. మహేష్ బాబుతో కలిసి దిగిన ఫొటో కూడా ఉంది. ఒక సినిమా హీరోను ఇంతగా అభిమానించిన రాజేష్ తన కన్న వాళ్ల గురించి మాత్రం ఒక్క క్షణం ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అత్యంత శోచనీయం. కొడుకుకు తల కొరివి పెట్టే పరిస్థితి ఒక కన్న తండ్రికి రావడానికి మించిన శోకం మరొకటి ఉండదు. ఇప్పుడు రాజేష్ తండ్రి పరిస్థితి అదే.
తల్లిదండ్రులు, కుటుంబం.. ఆ తర్వాతే తమను అభిమానించాలని ఎన్టీఆర్, మహేష్ బాబు.. ఇలా మన తెలుగు హీరోలు చాలా మంది.. చాలా సందర్భాల్లో చెప్పారు. ఏ హీరోలైనా తమ సినిమాలకు అభిమానులు రావాలని కోరుకుంటారు గానీ ఆ అభిమాని ఇలా అర్థాంతరంగా తనువు చాలిస్తే పట్టించుకునేంత తీరిక వాళ్లకు ఉండదని కొందరు నెటిజన్లు రాజేష్ మృతిపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హీరోలను అభిమానించే కొందరు అభిమానులు మాత్రం కుటుంబం కంటే హీరోలు, ఆ హీరోల సినిమాల ఫస్ట్ డే కలెక్షన్లు, రికార్డులే ముఖ్యమనే భావనలో బతుకుతున్నారని.. హీరోల ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయని నెటిజన్లు మండిపడ్డారు.
ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల యువత మేలుకోవాలని, అభిమానం పేరుతో బానిసత్వం చేయడం మానుకోవాలని.. కుటుంబం, జీవితంలో వృద్ధిలోకి రావడంపై ఆలోచన చేస్తే మంచిదని.. ఏం చేస్తే ఆర్థిక సమస్యల నుంచి తమ కుటుంబాలను బయటపడేయొచ్చో ఆ దిశగా ఆలోచన చేయాలని నెటిజన్లు హితవు పలికారు. సినిమా హీరోలను అభిమానించడం నేరమో.. తప్పో కాదని.. కానీ.. మన కుటుంబం ముఖ్యమని ఆ తర్వాతే హీరోలపై, పొలిటీషియన్లపై అభిమానం.. అనే అభిప్రాయం అభిమానుల్లో రావాలని నెటిజన్లు ఆశిస్తున్నారు.
అభిమానం మత్తులో కుటుంబ పరిస్థితులను నిర్లక్ష్యం చేసి.. మనకు అప్పులైతే, ఆర్థిక సమస్యలు ఎదురైతే మనం అభిమానించే ఏ హీరో, ఏ రాజకీయ నాయకుడు మనకు ఆర్థిక సాయం చేసి బయటపడేయడని ప్రతీ అభిమాని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి.. ఎన్నో పసి హృదయాలను, ఆ కుటుంబాల మనసును గెలుచుకున్న మహేష్ బాబు లాంటి హీరోను ఆదర్శంగా తీసుకుని సామాజిక, సేవా కార్యక్రమాలు చేేసే స్థాయికి అభిమానులు, ఆ అభిమానుల కుటుంబాలు ఎదిగే దిశగా మహేష్ బాబు అభిమానులు జీవితంలో ఆర్థికంగా రాణించాలని నెటిజన్లు ఆకాంక్షించారు.
