
వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం (అక్టోబర్ 14) ముగిసిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విండీస్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ లో పోరాడిన వెస్టిండీస్ కేవలం 121 పరుగుల టార్గెట్ ను మాత్రమే ఇండియా ముందు ఉంచగలిగింది. 121 పరుగుల టార్గెట్ ను ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి గెలిచింది. ఈ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ సెర్మనీలో భాగంగా ఎవరెవరు ఏ అవార్డు గెల్చుకున్నారో ఇప్పుడు చూద్దాం..
నితీష్ రెడ్డి - రూ.1 లక్ష - లాంగెస్ట్ సిక్స్ (89మీ సిక్స్):
రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ 89 మీటర్ల సిక్సర్ బాదాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన నితీష్.. ఓవరాల్ గా 54 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 43 పరుగులు చేసి ఒక చక్కటి క్యామియో ఆడాడు.
షాయ్ హోప్ - రూ. 1 లక్ష - బెస్ట్ వెస్టిండీస్ బ్యాటర్:
రెండో టెస్టులో వెస్టిండీస్ ఓడిపోయినప్పటికీ వికెట్ కీపర్ బ్యాటర్ షాప్ హోప్ ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 36 పరుగులు చేసి పర్వాలేదనిపించిన హోప్.. రెండో ఇన్నింగ్స్ లో 102 పరుగులు చేసి జట్టును ఇన్నింగ్స్ తేడాతో ఓడకుండా కాపాడాడు.
యశస్వి జైస్వాల్ - రూ.1 లక్ష - గ్రేట్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ గ్రేట్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో దాదాపు 70 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన జైశ్వాల్ 258 బంతుల్లో 175 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. జైశ్వాల్ ఇన్నింగ్స్ లో 22 ఫోర్లున్నాయి.
సాయి సుదర్శన్ - రూ.1 లక్ష - క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు ఓపెనర్ కాంప్ బెల్ క్యాచ్ కు షార్ట్ లెగ్ లో సాయి సుదర్శన్ అద్బుతంగా అందుకున్నాడు. జడేజా బౌలింగ్ లో బలంగా స్వీప్ షాట్ ఆడిన ఈ విండీస్ ఓపెనర్.. సాయి సుదర్శన్ రెప్పపాటులో పట్టిన అద్భుతమైన క్యాచ్ కు వెనుదిరిగాడు.
►ALSO READ | Gautam Gambhir: రోహిత్, కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా..? గంభీర్ సమాధానంతో కొత్త అనుమానాలు
కుల్దీప్ యాదవ్ - రూ.1 లక్ష - మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో విండీస్ జట్టును తిప్పలు పెట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టిన కుల్దీప్.. రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రవీంద్ర జడేజా - రూ.2.5 లక్షలు - మ్యాన్ ఆఫ్ ది సిరీస్
సిరీస్ లో ఆల్ రౌండ్ షో తో ఆకట్టుకునే జడేజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్ లో ఒకేసారి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన జడేజా తొలి టెస్టులో సెంచరీ (104) చేసి అదరగొట్టాడు. రెండు టెస్టుల్లో బౌలింగ్ లోనూ రాణించి 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.