
దేశంలోని ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కూల్ ఆఫర్ ప్రకటించింది. దీని కింద ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లు రూ.వెయ్యి ఉచితంగా అందుకోవచ్చని స్పష్టం చేసింది సంస్థ. ఈ చర్య ద్వారా నేషనల్ హైవేలపై పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఎన్ హెచ్ఏఐ భావిస్తోంది. దీని కింద హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను ఫొటోలు తీసి పంపాల్సి ఉంటుంది. అక్టోబర్ 31, 2025 వరకు ఈ ప్రత్యేక పథకం కింద సమాచారం అందించిన వ్యక్తుల ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలోకి బహుమతి మెుత్తం రూ.1000 జమ చేయబడుతుందని స్పష్టం చేయబడింది.
అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ల గురించి ఎలా రిపోర్ట్ చేయాలి..
* ముందుగా లేటెస్ట్ వర్షన్ రాజమార్గ్ యాత్ర యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
* నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల పరిధిలోని అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ల స్పష్టమైన టైమ్ స్టాంప్ కలిగిన ఫొటోలు, జియో ట్యాగ్ చేసి అప్‌లోడ్ చేయాలి.
* ఆ ప్రాంతం, మీ పేరు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, మెుబైల్ నంబర్ వివరాలు యాప్ లో అందించాలి.
* ఇలా రిజిస్టర్డ్ వాహనం నంబర్ కలిగిన ప్రతి సమాచారం రూ.1000 గెలుచుకోవటానికి అర్హత కలిగి ఉంటుంది. ఈ వాహనానికి అటాచ్ అయిన ఫాస్ట్ ట్యాగ్ ఖాతాకు బహుమతి మెుత్తం క్రెడిట్ అవుతుంది.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్కీమ్.. కేవలం ఎన్ హెచ్ఏఐ నిర్మించిన, నిర్వహిస్తున్న టాయిలెట్ల విషయంలో మాత్రమే వర్తిస్తుంది. ఒక్కో వాహనదారుడు ఒక్కసారి మాత్రమే బహుమతి మెుత్తం అందుకోవటానికి అర్హులు. ఒక టాయిలెట్ రోజుకు ఒక్కసారి బహుమతికి రిపోర్టింగ్ కి అర్హులు. ఒకే టాయిలెట్ వివరాలు చాలా మంది షేర్ చేస్తే ఒకే రోజున మెుదటగా రిపోర్ట్ చేసినవారికే బహుమతి. కేవలం యాప్ ద్వారా తీసిన క్లియర్ ఫొటోలు మాత్రమే విజేత ఎంపికకు అర్హత కలిగి ఉంటాయి. అందించబడిన వివరాలను ఏఐతో పాటు ఫిజికల్ స్క్రీనింగ్ కూడా నిర్వహిస్తోంది ఎన్ హెచ్ఏఐ. ప్రజలను శుభ్రతలో భాగస్వాములుగా చేయటానికి టెక్నాలజీని జోడించటం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తోంది.