యాదాద్రిలో జనాభాతో పోటీ పడుతున్న కోతులు

యాదాద్రిలో జనాభాతో పోటీ పడుతున్న కోతులు

రెండు మండలాల్లో మనుషుల కంటే డబుల్
నియంత్రించకుంటే మున్ముందు కష్టమే

యాదాద్రి, వెలుగు: కోతులు ఊరికి పదో ఇరవయ్యో ఉంటయ్.. జిల్లాకో వెయ్యో పదివేలో ఉంటయ్.. కానీ యాదాద్రి జిల్లాలో జనాభాతో పోటీ పడుతున్నయ్. జిల్లాలోని 17 మండలాల్లో 7.94 లక్షల మంది ఉండగా.. 5.17 లక్షల కోతులు ఉన్నాయి. రాజాపేట, గుండాల మండలాల్లో జనాభాను మించి ఉన్నాయి. ఎక్కడ చూసినా గుంపులు గుంపులు కనిపిస్తున్నాయి. పంటలపై పడి నాశనం చేస్తున్నాయి. ఇండ్లలోకి జొరబడి దొరికినవి ఎత్తుకెళ్తున్నాయి. కొన్నిచోట్ల మనుషులను గాయపరుస్తున్నాయి. కోతులను నియంత్రించే చర్యలు చేపట్టకుంటే వాటి సంఖ్య జిల్లా జనాభాను దాటే పరిస్థితి కనిపిస్తోంది.

యాదగిరిగుట్ట డివిజన్‌‌లో అత్యధికం

వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలంటూ సర్కారు చెప్పడంతో గతేడాది అగ్రికల్చర్ ఆఫీసర్లు రైతులతో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఆరుతడి పంటలు వేస్తే కోతులు నాశనం చేస్తాయని ఈ సదస్సుల్లో అనేక మంది రైతులు చెప్పారు. దీనిపై స్పందించిన సర్కారు.. కోతుల లెక్క తీయాలంటూ ఆఫీసర్లను ఆదేశించింది. సర్వే ప్రారంభించిన యాదాద్రి వ్యవసాయ అధికారులు.. జిల్లాలోని 17 మండలాల్లోని 97 క్లస్టర్లలో కోతుల గుంపులు ఎన్ని, వాటిలో ఉన్న కోతుల సంఖ్య ఎంత అనే లెక్కలు తీశారు. జిల్లాలో 3,773 గుంపులు ఉన్నాయని, ఒక్కో గుంపులో 35 నుంచి 200కు పైగా కోతులు ఉన్నాయని గుర్తించారు. ఈ లెక్కన మొత్తంగా 5,17,578 కోతులున్నాయని తేల్చారు. ఆలేరు డివిజన్‌‌లో 686 గుంపులు, 1,65,204 కోతులు, భువనగిరి డివిజన్‌‌లో 1,306 గుంపులు, 1,08,556 కోతులు, యాదగిరిగుట్ట డివిజన్‌‌లో 990 గుంపులు, 1,67,631 కోతులు, చౌటుప్పల్ డివిజన్‌‌లో 791 గుంపులు, 31,187 కోతులు ఉన్నాయని తేల్చారు.

ఆడ కోతులు 3 లక్షలకు పైనే

జిల్లాలోని 17 మండలాల్లో సర్వే చేసిన జనవరి నాటికి కోతుల సంఖ్య 5,17,578కి చేరింది. ఇందులో ఆడ కోతుల సంఖ్య సుమారుగా 3 లక్షలకు పైగా, మగ కోతుల సంఖ్య 2 లక్షలకు పైగా ఉంది. కోతుల జీవిత కాలం 14 నుంచి 30 ఏండ్ల వరకు ఉంటుంది. ఒక్కో కోతి జీవితకాలంలో కనీసం 10 పిల్లలకు జన్మనిస్తుంది. ఈ లెక్కన వాటి జీవిత కాలం, సంతానోత్పత్తిని పరిశీలిస్తే జిల్లా జనాభాను మించే అవకాశం కూడా ఉంది. అడవులు తగ్గిపోవడం, పండ్ల చెట్లు లేకపోవడంతో కోతులు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఎక్కడైనా పెంకుటిల్లు ఉంటే పీకి పందిరేస్తున్నాయి. కూరగాయల తోటలు, పండ్ల తోటలను ధ్వంసం చేస్తున్నాయి. జనంపై దాడి చేస్తున్న ఘటనలు ఉన్నాయి. కోతుల నియంత్రణలో భాగంగా ఇప్పటిదాకా పంచాయతీ, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో వాటిని పట్టుకొని​ఇతర ప్రాంతాల్లో వదిలేసినా మళ్లీ వచ్చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌‌లో కోతుల జనాభాను నియంత్రించేందుకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇదే విషయంపై గతంలో ప్రభుత్వం ఆలోచనలు చేసినా అది ఆచరణలోకి రాలేదు. ఇప్పటికైనా కోతులను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన
అవసరముంది.

రాజాపేట, గుండాలలో జనాన్ని మించిపోయినయ్

రాజాపేట, గుండాల మండలాల్లో జనం కంటే కోతుల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇటీవల ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం రాజాపేట మండలంలో 37,902 మంది ఉండగా.. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం కోతుల సంఖ్య 79,200గా ఉంది. గుండాలలో 31 వేల మంది ఉండగా.. కోతులు 77,709 ఉన్నాయి. ఆలేరులో 12,950, ఆత్మకూరులో 14,230, మోత్కూరులో 33,265, అడ్డగూడూరులో 27,650, భువనగిరిలో 13,676, బీబీనగర్​లో 32,250, భూదాన్​ పోచంపల్లిలో 30,740, వలిగొండలో 31,620, బొమ్మల రామారంలో 8,530, తుర్కపల్లిలో 32,250, యాదగిరిగుట్టలో 22,701, మోటకొండూరులో 24,350, సంస్థాన్ నారాయణపూర్​లో 15,667, చౌటుప్పల్​లో 10, 520, రామన్నపేటలో 50 వేల కోతులు ఉన్నాయి.