పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాకు బెయిల్

పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాకు బెయిల్

ముంబయి: పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్ లభించింది. గత జులై 19న ఈయనను అరెస్టు చేసిన ముంబయి పోలీసులు విచారణ నిమిత్తం జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో రెండుసార్లు పోలీసులు భారీ ఎత్తున చార్జిషీటు దాఖలు చేశారు. తొలి చార్జిషీటులో సమగ్రమైన సమాచారం లేదని చెబుతూ.. అనుబంధంగా 1500 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. 
ముంబయిలో సినిమా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను ట్రాప్ చేసి అశ్లీల చిత్రాలు తీసి వాటిని విదేశాలకు పంపి మార్కెట్లో అమ్ముకుంటూ కోట్లు గడించారని ముంబయి పోలీసులు అభియోగాలు మోపారు. రాజ్ కుంద్ర ఆఫీసుతోపాటు ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేసి ఆయన మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోని కంప్యూటర్ల హార్డ్ డిస్క్ ను కూడా తీసుకుని శిల్పా శెట్టి వాంగ్మూలం తీసుకున్న విషయం తెలిసిందే.
రాజ్ కుంద్రా ఫోన్లు, కంప్యూటర్లను విశ్లేషిస్తూ..చార్జిషీట్ దాఖలు చేసిన నేపధ్యంలో రాజ్ కుంద్రా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు తనపై తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపించారు. తాను అమాయకుడినని.. తనను అన్యాయంగా అశ్లీల చిత్రాల కేసులో ఇరికించారని వాపోయారు. తానే సూత్రధారి అన్న అభియోగాలు మోపడం తప్ప ఎలాంటి స్పష్టమైన ఆధారాలు పోలీసులు చూపలేదని రాజ్ కుంద్రా తరపు న్యాయవాది వాదించడంతో ఎట్టకేలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.