ఎండలకు అంబలి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు

ఎండలకు అంబలి తాగితే  ఆరోగ్యానికి ఎంతో మేలు

సిటీలో ఎండలు దంచికొడుతున్నాయి. వేడిని తట్టుకునేందుకు జనాలు కూల్ డ్రింక్స్ తాగుతూ రిలాక్స్ అవుతున్నారు. శరీరం డీ హైడ్రేట్ కాకుండా సిటీ జనాలకు ఆరోగ్యకరమైన సహజసిద్ధమైన డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అంబలి, రాగి జావ ఎంతో కూల్చేస్తుంది. వడదెబ్బకు సరైన మందు అంబలి అని డాక్టర్లే చెబుతుంటారు. రక్తపోటు , షుగర్ , రక్త స్రావంతో ఇబ్బంది పడుతున్నవారికి.. నీరసం,వేడితో ఇబ్బందిపడే వారికి రాగి అంబలి చాలా ఉపయోగకరం. అయితే  కేవలం రాగులతోనే కాకుండా బియ్యం, సజ్జలు, జొన్నలు, రాగులతో కలిపి అంబలి చేయచ్చు. ఇది రాగులతో చేసిన అంబలి కంటే మేలు చేస్తుంది. ఎండల వల్ల కలిగే ఏ చిన్న సమస్యను దరిచేర నివ్వదు. ఇందులో ఐరన్, ఫైబర్, ఖనిజాలు, అయోడిన్ పుష్కలంగాఉంటాయి. అంతేకాదు ఈ జావ అయిదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. చంటి పిల్లలకి తినిపించినా కూడా చాలా మంచిది. ఆరునెలలు దాటిన వయసు నుంచి ఎవ్వరైనా దీన్ని తీసుకోవచ్చు.ప్రస్తుతం సిటీలో పలుచోట్ల తక్కువ ధరకే వ్యాపారులు అంబలి సెంటర్లు నెలకొల్పారు . కొన్నిస్వచ్ఛంద సంస్థలు ఉచితంగా అంబలి పంపిణీచేస్తున్నాయి. ముషీరాబాద్ లోని రాకేష్ గౌడ్ కు  చెందిన స్వీట్ హౌస్ లో 16 ఏళ్లుగా వేసవికాలంలో అంబలి పంపిణీ చేస్తున్నట్టు నిర్వాహకులు చెప్పారు . మొదట్లో ఉచితంగా అందించినా, తాగే వారి సంఖ్య పెరగడంతో నామమాత్రంగా చార్జి చేస్తున్నట్టు చెప్పారు.