కరోనా పేషెంట్స్ ఇళ్లపై పోస్టర్లు అతికించొద్దు

కరోనా పేషెంట్స్ ఇళ్లపై పోస్టర్లు అతికించొద్దు

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్స్ ఇంటి పై పోస్టర్లు లేదా గుర్తులు అతికించకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనాతో బాధపడుతున్న వారి ఇళ్ల మీద సంకేతాలు, గుర్తులు ఉండేలా ఎలాంటి పోస్టుర్లు అతికించడం, గానీ రాయడం గానీ చేయకూడదని తెలిపింది. కొన్ని ప్రత్యేక కేసుల విషయంలో మాత్రం డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ యాక్ట్ కింద అధికారులు పోస్టర్లు అతికించొచ్చని పేర్కొంది.

ఐసోలేషన్‌‌లో ఉన్న పేషెంట్ల ఇళ్లపై పోస్టర్లు అతికించడంపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన కేసుపై జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్.సుభాష్ రెడ్డి, ఎంఆర్ షాల త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పును ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా.. కేంద్రం చెప్పనప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమంత తామే పోస్టర్లు అతికిస్తున్నాయని కోర్టుకు నివేదించారు. ఈ విషయంపై ఇప్పటికే అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల అడిషనల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీ (హెల్త్)లకు తగిన సూచనలను చేశామని అత్యున్నత ధర్మాసనానికి ఇచ్చిన అఫిడవిట్‌‌లో కేంద్రం పేర్కొంది.