అంత్యక్రియలు చేసిన 11 రోజులకు పోస్టుమార్టం

అంత్యక్రియలు చేసిన 11 రోజులకు పోస్టుమార్టం
  • 11 రోజుల తర్వాత పోస్టుమార్టం​

దుబ్బాక, వెలుగు : సహజ మరణం చెందినట్లు భావించిన ఓ మహిళకు అంత్యక్రియలు చేసిన 11 రోజులకు పోస్టుమార్టం​ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్​ గ్రామానికి చెందిన బైండ్ల బాలవ్వ (52) ఇంటి వద్ద ఒంటరిగా ఉండేది.  ఆమె ఇద్దరు కుమారులు నాగరాజు, పరశురాములు హైదరాబాద్​లో నివాసం ఉంటున్నారు. ఈనెల 6న బాలవ్వ ఇంట్లో కింద పడి మరణించిందని చుట్టుపక్కల వాళ్లు ఆమె కుమారులకు ఫోన్​లో సమాచారం అందించారు. ఈనెల7న హైదరాబాద్​ నుంచి కుమారులు, బంధువులు కలిసి బాలవ్వ అంత్యక్రియలు పూర్తిచేశారు. తమ సొంత పొలంలోనే కుటుంబ సభ్యులు ఖననం చేసి ఇంటికొచ్చారు.

అయితే, ఇంట్లో రక్తపు మరకలు ఉండడం, దిండులో రక్తపు మరకలు కలిగిన బట్టలు ఉండడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. తమ తల్లి బాలవ్వది సహజ మరణం కాదని, హత్య చేసి ఉంటారని ఆమె కుమారులు దుబ్బాక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కుమారుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం తహసీల్దార్​ జయంత్, సీఐ మున్నూరు కృష్ణ, ఎస్ఐ రంగరాజు ఆధ్వర్యంలో క్లూస్​ టీం.. బాలవ్వను ఖననం చేసిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడే పోస్టుమార్టం చేశారు. బాలవ్వది హత్యనా, సహజ మరణమా అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.