బషీర్ బాగ్, వెలుగు : మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలని, జీవో నంబర్ 46ను రద్దు చేసి గ్రామీణ ప్రాంత యువకులకు న్యాయం చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లక్డీకాపూల్లోని డీజీపీ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చివరికి ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో జరిగిన తోపులాటతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 2022 కానిస్టేబుల్ నోటిఫికేషన్ సందర్భంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 46ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.
పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టి.. గ్రామీణ ప్రాంత యువకులకు న్యాయం చేయాలని కోరారు. జీవో 46 కారణంగా జనాభా ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తున్నారన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే 53శాతం పోస్టులు భర్తీ అవుతున్నాయని తెలిపారు. 50శాతానికి పైగా పోస్టులు అక్కడే భర్తీ అయితే మిగిలిన జిల్లాల్లోని అభ్యర్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జీవో 46 వల్ల జిల్లాలకు కటాఫ్ పోస్టులు పెట్టడంతో చాలా మంది అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారని విమర్శించారు. మెరిట్ ఆధారంగానే పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో అనిల్, మధు, కరుణాకర్, హరీశ్, రాఘవేంద్ర, నవీన్, శ్రీనివాస్, రఘు తదితరులు ఉన్నారు.

