
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఈ నెల 22 నుంచి 24 వరకు పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. పౌల్ట్రీ ఫీడ్ పరికరాలు, టెక్నాలజీలు, గుడ్ల పెంపకం, కోళ్ల ఆరోగ్యం, అంతర్జాతీయ ఉత్పత్తులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. పరిశోధన, సైన్స్, టెక్నాలజీలో తాజా పురోగతిని కూడా తెలియజేస్తుంది. సైంటిఫిక్ ఫోరమ్‌లను నిర్వహించడమేగాక పౌల్ట్రీ పరిశ్రమలో కెరీర్ అవకాశాలను కూడా తెలియజేస్తారు. మనదేశం నుంచి రికార్డు స్థాయిలో 380 కంపెనీలు, విదేశాల నుంచి 45 కంపెనీలు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటాయి.
మూడు రోజుల్లో 30 వేల మంది బిజినెస్ విజిటర్లు వస్తారని అంచనా. పలుదేశాల నుంచి 1,500 మందికిపైగా ప్రతినిధులు సంతానోత్పత్తి, పరిశుభ్రత, పోషకాహారం, జంతువుల ఆరోగ్యం, పౌల్ట్రీ పరికరాలు గురించి మాట్లాడుతారు. భారతీయ పౌల్ట్రీ రంగం 25 వేల మందికి పైగా లేయర్ రైతులకు, 10 లక్షల బ్రాయిలర్ రైతులకు ఉపాధిని కల్పిస్తోందని అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ బయాస్ అన్నారు. హైదరాబాద్‌లో గత పదిహేను సంవత్సరాలుగా ఫౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) ప్రకారం ఇండియాలో తలసరి గుడ్ల వినియోగం 180 కాగా, కోడి మాంసం తొమ్మిది కిలోలు ఉంది. భారతదేశం గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో, కోడి మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది.