ఆయిల్​ పోసి  డబుల్​ ఇంజన్​ సర్కార్ ను నడిపిస్తుర్రు : మంత్రి హరీశ్ రావు

ఆయిల్​ పోసి  డబుల్​ ఇంజన్​ సర్కార్ ను నడిపిస్తుర్రు : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. హైదరాబాద్​లో సభ పెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసారని రాష్ట్ర  వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘవపూర్ లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమేళనంలో ఎమ్మెల్సీ ఫారూక్​హుస్సేన్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలతో పాటు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు.  తెలంగాణకు రావాల్సిన రూ.30 వేల కోట్లు ఆపి బాయిలకాడ మోటార్లు పెడితేనే డబ్బులు ఇస్తామంటుర్రని పేర్కొన్నారు. అయినా సీఎం కేసీఆర్ రైతులకు అన్యాయం చేయొద్దనే అందుకు ఒప్పుకోలేదన్నారు.

ఉత్తర్​ప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ లో కరెంట్ సప్లయ్​ లేక ఆయిల్ పోసి మోటార్లు నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ అందుతుందని.. కేసీఆర్​ దూరదృష్టితోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రం వచ్చాక ఎరువుల కోసం ఇబ్బంది లేదన్నారు. కాళేశ్వరం దండగా అన్న ప్రతిపక్షాలు గ్రామాల్లోకి వస్తే దండగో.. పండగో తెలుస్తుందన్నారు.  సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ ను సూపర్ స్పెషాలిటీ గా మారుస్తామన్నారు.

ఉద్వేగానికి లోనైన మంత్రి..

ప్రజలు చూయిస్తున్న ప్రేమకు తన కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని, వారి ఆదరణకు తాను ఎంత సేవ చేసినా తక్కువేనని, ఇంకా చాలా సేవ చేయాల్సి ఉందని హరీశ్​రావ్​అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగించిన ఆయన ఓ సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు.

అంతకుముందు సిద్దిపేట శివాజీ సర్కిల్ నుంచి రాఘవాపూర్ వరకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువజన విభాగాల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో మంత్రికి స్వాగతం పలికారు. గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి మంత్రి పూల మాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, ఎంపీపీ శ్రీదేవి చందర్ రావు, పార్టీ మండలాధ్యక్షుడు ఎర్ర యాదయ్య, జడ్పీటీసీ శ్రీహరి గౌడ్ పాల్గొన్నారు.