కరెంట్​ చార్జీల బాదుడు

కరెంట్​ చార్జీల బాదుడు
  • ఇండ్లకు ఒక్కో యూనిట్​కు 50 పైసలు, కమర్షియల్​, 
  • ఇండస్ట్రీస్​కు రూ. 1 పెంపు 
  • కస్టమర్​ చార్జీలు డబుల్​
  • ఫిక్స్​డ్​ డిమాండ్​ చార్జీ రూ. 10
  • వచ్చే నెల 1 నుంచి అమలు.. ఈఆర్​సీ గ్రీన్​ సిగ్నల్​ 
  • వ్యవసాయ ట్రాన్స్‌‌ఫార్మర్లకు మీటర్లు పెట్టాలని ఆదేశం
  • సర్కారు బాకీ 12వేల కోట్లు చెల్లిస్తే పెంపు అవసరమే లేదు!


రాష్ట్ర సర్కారు విద్యుత్‌‌ సంస్థలకు రూ. 12 వేల కోట్ల కరెంట్​ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లిస్తే చార్జీలు పెంచి ప్రజలపై రూ. 5,596 కోట్లు భారం మోపాల్సిన అవసరమే ఉండదని విద్యుత్​రంగ నిపుణులు అంటున్నారు.  హైదరాబాద్‌‌ కేంద్రంగా ఉన్న టీఎస్‌‌ ఎస్‌‌పీడీసీఎల్‌‌ పరిధిలో మొత్తం కరెంట్​ బిల్లు బకాయిలు రూ. 10,235.68 కోట్లు ఉండగా.. ఇందులో ప్రభుత్వ సంస్థల బకాయిలే రూ.7141.71 కోట్లు.  వరంగల్‌‌ కేంద్రంగా ఉండే టీఎస్‌‌ ఎన్‌‌పీడీసీఎల్‌‌ పరిధిలో మొత్తం కరెంట్​ బిల్లు బకాయిలు రూ. 6,966.47కోట్లు ఉండగా.. ఇందులో గవర్నమెంట్‌‌ సంస్థల బాకీలే రూ.  5,457.02 కోట్లు. అంటే.. డిస్కంలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన కరెంట్​ బిల్లుల పైసలే  రూ. 12,598.73కోట్లు. 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కరెంటు చార్జీల మోత మోగనుంది. 14 శాతం పెంచుకునేందుకు ఈఆర్‌‌సీ గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. వచ్చే నెల 1 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. యూనిట్​పై ఇండ్లకు 50 పైసలు, ఇతర కేటగిరీలకు రూపాయి చొప్పున పెంచనున్నారు. కరెంటు చార్జీలతో పాటు కస్టమర్‌‌ చార్జీలు కూడా భారీగా పెరగనున్నాయి. స్లాబులు మారితే బిల్లు ఇంకింత తడిసిమోపెడుకానుంది. ఈ పెంపుతో రాష్ట్ర ప్రజలపై ఏటా అదనంగా రూ. 5,596 కోట్ల భారం పడనుంది. 

కొనుగోళ్ల ఖర్చు పెరిగిందని..!
విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగినందునే టారిఫ్ పెంచాల్సి వచ్చిందని ఈఆర్‌‌సీ  చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరెంటు చార్జీల పెంపుపై నిర్వహించిన నాలుగు బహిరంగ విచారణల్లో 244 మంది తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారని అన్నారు. అయితే.. వీరిలో ఏ ఒక్కరూ చార్జీలు పెంచాలని కోరకపోయినా, పెంచుతూ ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది. డిస్కంలు 18 శాతం చార్జీలు పెంచాలని కోరగా .. 14 శాతం మేరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీరంగారావు చెప్పారు. ఇకపై కరెంటు లెక్క పక్కాగా తెలియడానికి వ్యవసాయ కనెక్షన్లున్న ట్రాన్స్‌‌ఫార్మర్లకు మీటర్లు పెట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. 

యూనిట్లు    పాత టారిఫ్‌‌    కొత్త టారిఫ్‌‌ 
0‑50    రూ.1.45    రూ.1.95
51‑100    రూ.2.60    రూ.3.10
100 యూనిట్లపైగా వాడితే.. 
0-100    రూ.3.30    రూ.3.40
101‑200    రూ.4.30    రూ.4.80
200 యూనిట్లకు పైగా వాడితే.. 
0‑200    రూ.5.00    రూ.5.10
201‑300    రూ.7.20    రూ.7.70
301‑400    రూ.8.50    రూ.9.00
401‑800    రూ.9.00    రూ.9.50
800పైగా     రూ.9.50    రూ.10.00

గృహ వినియోగదారుల చార్జీల ప్రతిపాదనల్లో స్వల్ప మార్పులు తప్ప డిస్కంల టారిఫ్ ప్రతిపాదనలన్నింటినీ ఈఆర్‌‌సీ ఆమోదించింది. ఇప్పటి వరకు గృహ వినియోగదారులకు ఫిక్స్‌‌డ్‌‌ డిమాండ్‌‌ చార్జీలు లేవు. కానీ, కొత్తగా దీన్ని తెరపైకి తెచ్చారు. ఫిక్స్​డ్​ డిమాండ్​ చార్జీ పేరిట రూ. 10 వసూలు చేయనున్నారు. 

రూ. 5,596 కోట్ల వసూళ్లకు గ్రీన్‌‌ సిగ్నల్‌‌
14 శాతం చార్జీల పెంపు వల్ల 2022–23  ఆర్థిక సంవత్సరానికి రూ. 5,596 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి డిస్కంలకు అనుమతి లభించింది. ఏఆర్‌‌ఆర్‌‌లో రూ. 53,053.55 కోట్ల అవసరాల అంచనాలు వేయగా.. ఈఆర్‌‌సీ దాన్ని రూ. 48,708.27 కోట్లకు సవరించింది. రూ. 16,866.55 కోట్లు లోటుగా ఉంటుందని డిస్కంలు తెలుపగా.. రూ. 14,237.40 కోట్లకు కమిషన్‌‌  ఆమోదించింది. టారిఫ్‌‌ పెంపు ద్వారా  రూ.6, 831కోట్లు చార్జీల రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని డిస్కంలు ప్రతిపాదించగా.. కమిషన్‌‌ కొంత కోత పెట్టి రూ. 5,596 కోట్లు వసూలు చేసుకోవడానికి గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. 

50 యూనిట్లలోపు వాడే పేదలకూ భారమే
నెలకు 50 యూనిట్లలోపు కరెంట్​ వాడే పేదలపై కూడా కరెంట్​ చార్జీల భారం భారీగా పడనుంది. 0–50 యూనిట్లలోపు వినియోగించే వాళ్లు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. గత 20 ఏండ్లుగా ఈ కేటగిరీ వారికి యూనిట్‌‌కు ఒక్క రూపాయి 45 పైసలు అమలు చేస్తుండగా.. ఈ బేసిక్‌‌ చార్జీలో కూడా ఇప్పుడు 50 పైసలు పెంచేశారు. ఇకపై బేసిక్‌‌ చార్జీ(యూనిట్​కు)  రూ. 1.95 కానుంది.  

మధ్యతరగతి ప్రజలపైనా భారీ భారం
51–100 యూనిట్లలోపు వినియోగానికి ప్రస్తుతం యూనిట్​కు రూ. 2.60 ఉంటే.. పెరిగిన 50 పైసలతో కలిపితే ఇక ముందు యూనిట్‌‌కు రూ. 3.10 చార్జ్​ చేయనున్నారు. అదే విధంగా 101–200 యూనిట్ల వరకు వినియోగానికి యూనిట్​కు రూ. 4.30  చొప్పున ప్రస్తుతం డిస్కంలు విద్యుత్‌‌ చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇక నుంచి రూ. 4.80 వసూలు చేయనున్నారు.  

150 యూనిట్లు వాడితే వచ్చే బిల్లు ఇట్లా..!
150 యూనిట్ల కరెంట్​ వాడే ఇంటికి ప్రస్తుతం రూ. 627.70 బిల్లు వస్తున్నది. పెరిగిన చార్జీలతో లెక్కేసుకుంటే.. యూనిట్​కు రూ. 3.40 చొప్పున 100 యూనిట్ల వరకు రూ. 340.. ఆపై మిగతా 50 యూనిట్లకు రూ. 4.80 చొప్పున రూ. 240.. వాటికి 6 శాతం ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ. 34.80, కస్టమర్‌‌ చార్జీ రూ. 90 వస్తుంది. దీనికి అదనంగా ఫిక్స్​డ్​ డిమాండ్​ చార్జి రూ. 10 కూడా కలిపి వచ్చే మొత్తం బిల్లు రూ.714.80. 

కమర్షియల్‌‌, ఇండస్ట్రియల్‌‌కు ఇట్లా..
కమర్షియల్‌‌ వినియోగదారుల్లో 50 యూనిట్ల వరకు వాడితే ప్రస్తుతం యూనిట్​కు రూ. 6 వసూలు చేస్తుండగా.. ఇక నుంచి రూ. 7 వసూలు చేయనున్నారు.  0–100 యూనిట్లు వాడే కమర్షియల్‌‌ కనెక్షన్లకు ఇప్పటి వరకు యూనిట్​కు రూ. 7.50 ఉండగా.. ఇక నుంచి రూ. 8.50 వసూలు చేస్తారు. 100–300 యూనిట్లు వాడే కమర్షియల్‌‌ కేటగిరికి ప్రస్తుతం యూనిట్​కు  రూ. 8.90 ఉండగా.. ఇకపై రూ.9.90 చార్జ్​ వేస్తారు.  500 యూనిట్ల కంటే ఎక్కువ వాడే కమర్షియల్‌‌ కేటగిరికీ ప్రస్తుతం యూనిట్​కు రూ. 12 ఉండగా.. ఇక నుంచి రూ. 13 చార్జ్​ చేయనున్నారు. ఇండస్ట్రియల్‌‌  కేటగిరికి ప్రస్తుతం యూనిట్​కు రూ. 6.70 చార్జ్​ చేస్తుండగా.. ఇకపై  రూ. 7.70 వసూలు చేయనున్నారు. 

సర్కారు సబ్సిడీ పెంపు
గతంలో అగ్రికల్చర్‌‌, బీపీఎల్‌‌ కుటుంబాలు, సంక్షేమ పథకాలపై డిస్కంలకు ప్రభుత్వం చెల్లించే విద్యుత్‌‌ సబ్సిడీ రూ. 5,940.47 కోట్లు ఉండగా.. దీన్ని రూ. 8,221.17 కోట్లకు ఈఆర్​సీ ప్రతిపాదించింది.  

చార్జీల భారం పడనిది వీళ్లకే
ఎల్టీ –2 పరిధిలోని 200 యూనిట్ల వరకు వినియోగించే సెలూన్లకు, లాండ్రీ షాపులకు కరెంట్​ చార్జీలు పెరగలేదు. ఎల్టీ–4 పరిధిలోని కుటీర పరిశ్రమలకు టారిఫ్‌‌ ఎప్పటిలాగే కొనసాగించనుంది. ఎల్టీ–5 పరిధిలోని వ్యవసాయ వర్గానికి చార్జీలు పెంచలేదు.

ఈఆర్సీ ఆదేశాలివి..!
అగ్రికల్చర్‌‌ కు వినియోగించే ట్రాన్స్‌‌ఫార్మర్లకు అన్నింటికి టూవే కమ్యూనికేషన్‌‌ టెక్నాలజీని వినియోగించి రెండేండ్లలో మీటర్లు బిగించాలి. దీనిపై ప్రతి క్వార్టర్లీ రిపోర్టు అందించాలి. 
–    15 శాతం కంటే ఎక్కువగా ఉన్న విద్యుత్‌‌  నష్టాలు తగ్గించేందుకు టైంబౌండ్‌‌ యాక్షన్‌‌ ప్లాన్‌‌ అమలు చేయాలి. నష్టాలు తగ్గించకపోతే ఏఆర్‌‌ఆర్‌‌లో నష్టాలను క్లెయిమ్‌‌ చేసుకోవడానికి అనుమతించబోం.
–    ఆసక్తి ఉన్న వినియోగదారులందరికీ స్మార్ట్‌‌ ప్రీపెయిడ్‌‌ మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
–    డిస్కంల విద్యుత్‌‌ సరఫరా ప్రాంతాల్లో స్మార్ట్‌‌ గ్రిడ్‌‌ సౌకర్యాలను విస్తరించడానికి యాక్షన్‌‌ ప్లాన్‌‌ ఇవ్వాలి. జీడిమెట్ల స్మార్ట్‌‌ గ్రిడ్‌‌ను విస్తరించాలి. 
–    ఈఆర్‌‌సీ నిబంధనల ప్రకారం నవంబర్‌‌ 30లోగా ఏఆర్‌‌ఆర్‌‌  దాఖలు చేయాలి. లేదంటే జాప్యానికి జరిమానాలు విధించాల్సి ఉంటుంది. 
కస్టమర్‌‌  చార్జీలు డబుల్​
గృహ వినియోగదారులకు కస్టమర్‌‌ చార్జీలు డబుల్​ అయ్యాయి. ప్రస్తుతం డొమెస్టిక్‌‌ కేటగిరీలో 0–50 యూనిట్లలోపు కరెంటు వాడకానికి  కస్టమర్‌‌ చార్జీ రూ. 25 ఉంటే.. తాజా టారిఫ్‌‌లో దీన్ని రూ. 40కి పెంచారు.  51–100 యూనిట్ల కరెంటు వాడకానికి ప్రస్తుతం రూ. 30 ఉండగా.. అది రూ. 70కి పెరుగనుంది. 101–200 యూనిట్ల కరెంటు వాడకానికి ప్రస్తుతం రూ. 50 ఉండగా.. దాన్ని రూ. 90కి పెంచారు. 201– 300 యూనిట్లు వాడే వారికి ప్రస్తుతం రూ. 60 ఉండగా.. దాన్ని రూ.100కు తీసుకెళ్లారు. 301–400 యూనిట్లు కరెంటు వాడే వారికి ప్రస్తుతం రూ.80 ఉంటే.. దాన్ని రూ.120కి చేర్చారు. 400 యూనిట్లు దాటి ఆపై ఎన్ని యూనిట్లు కరెంటు వాడినా ప్రస్తుతం వేసే కస్టమర్​ చార్జీ రూ.  80 ఉండగా.. కొత్త టారిఫ్‌‌ ప్రకారం 401–800 యూనిట్లు వాడే వారికి రూ. 140..  800 యూనిట్లకు పైన వాడే వారికి రూ.160 కస్టమర్‌‌ చార్జీలు వడ్డించనున్నారు.
శ్లాబ్‌‌ మారితే అంతే..!
తాజాగా ప్రకటించిన చార్జీలకు తోడు నాన్‌‌ టెలిస్కేపిక్‌‌ విధానం మాయాజాలంతో కరెంటు బిల్లులు భారీగా పెరుగనున్నాయి. శ్లాబ్‌‌ మారితే బిల్లు చూసి గొల్లుమనే పరిస్థితి రానుంది. 100 యూనిట్లు, 200 యూనిట్లు, 300 యూనిట్లు ఇలా శ్లాబుల వారీగా ఉన్న కరెంటు చార్జీలు అదనంగా ఒక్క యూనిట్‌‌  ఎక్కువ వాడినా బిల్లు మరింత పెరిగే అవకాశం ఉంది. వినియోగదారులకు కరెంటు వాడుకునే విధానంలో అవగాహన లేక పోతే తిప్పలు తప్పవని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు. 100 యూనిట్ల తర్వాత ఒక్క యూనిట్‌‌  ఎక్కువ కరెంటు కాలినా రూ. 232 అదనంగా భారం పడుతుంది. ప్రస్తుతం పాత లెక్క ప్రకారం 100 యూనిట్ల వరకు రూ. 232.50 అవుతుంది. కానీ కొత్తగా వచ్చే బిల్లు ప్రకారం 101 యూనిట్‌‌ కరెంట్​ వాడితే శ్లాబ్‌‌ మారిపోయి కస్టమర్‌‌ చార్జీలు, 6 శాతం ట్యాక్స్‌‌, అంతా కలిపి రూ. 464.50 బిల్లు వస్తుంది.