HCA: ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్.. CSK vs SRH మ్యాచ్ జరిగేనా..?

HCA: ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్.. CSK vs SRH మ్యాచ్ జరిగేనా..?

ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం అంధకారంలో చిక్కుకుంది. రూ.3 కోట్లకు పైగా విద్యుత్ బిల్లులు చెల్లించడంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్(హెచ్‌సీఏ) విఫలమవ్వడంతో  విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేశారు. దీంతో స్టేడియం పరిసరాలన్నీ చీకటిని అలుముకున్నాయి. 

గత కొన్నేళ్లుగా హెచ్‌సీఏ విద్యుత్ బిల్లులు చెల్లించక పోవడంతో తెలంగాణ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. హెచ్‌సీఏకు చెందిన HBG2192 కనెక్షన్‌పై పెండిగ్ బిల్లుల బకాయిల కోసం రంగారెడ్డి జిల్లా కోర్టులో 2018లో కేసు వేశారు. దీంతో డిఫాల్టర్‌గా ఉన్న హెచ్‌‌సీఏ పెండింగ్ బిల్లు రూ. 1.41 కోట్లతో పాటు రూ. 1.64 కోట్ల సర్‌చార్జి కలిపి రూ. 3.05 కోట్లు వారం రోజుల లోగా చెల్లించాలని డిసెంబర్ 6న కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ తరువాత కూడా పలుమార్లు నోటీసులు జారీ చేసినా హెచ్‌సీఏ అధికారుల్లో చలనం లేకపోవడంతో గురువారం(ఏప్రిల్ 4)  టీఎస్ఎస్‌పీడీసీఎల్ అధికారులు.. విద్యుత్ సరఫరను నిలిపివేశారు.

CSK vs SRH మ్యాచ్ జరిగేనా..?

ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం(ఏప్రిల్ 5) ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడాల్సి ఉంది. ఉన్నట్టుండి విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేయడంతో.. ఆ మ్యాచ్ పై అనిశ్చితి నెలకొంది. మ్యాచ్ జరుగుతుందా..! లేదా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.