హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ ముందు విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు బుధవారం మహాధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు. జేఏసీ అందజేసిన 14 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నాయకులు స్పష్టం చేశారు.
ముఖ్యంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనుల టెండర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని జేఏసీ చైర్మన్ సాయిబాబా డిమాండ్ చేశారు. ప్లాంట్ భద్రత, దీర్ఘకాలిక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బాధ్యతలను ఔట్‌సోర్సింగ్ ఇవ్వకుండా జెన్‌కో అనుభవజ్ఞులైన ఉద్యోగులకే అప్పగించాలని, అవసరమైన శాశ్వత పోస్టులను మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.
