రేపటి (ఆగస్టు22)  నుంచి పవర్ ఎగ్జిబిషన్

రేపటి (ఆగస్టు22)  నుంచి పవర్ ఎగ్జిబిషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ రంగంలో చేపడుతున్న విప్లవాత్మక మార్పులు, ఆధునిక సాంకేతికతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా పవర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు సదరన్ డిస్కమ్ సీఎండీ జితేష్ వి. పాటిల్ తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌‌‌‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఈ నెల 22 నుంచి 24 వరకు మూడ్రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. గురువారం ఈ ఎగ్జిబిషన్ విధివిధానాలను సీఎండీ వెల్లడించారు.

విద్యుత్ పంపిణీ వ్యవస్థను స్మార్ట్‌‌‌‌గా తీర్చిదిద్దేందుకు సంస్థ చేపడుతున్న స్కాడా విస్తరణ, స్మార్ట్ మీటరింగ్, ఏఐ ఆధారిత సేవలు తదితర అంశాలను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలో 132 కేవీ సబ్‌‌‌‌స్టేషన్ మోడళ్లు, ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ విధానాలతో పాటు గృహ వైరింగ్ భద్రత, ప్రమాదాల నివారణ చర్యలను ప్రత్యక్ష నమూనాలతో వివరించనున్నారు. ప్రజలు, విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్‌‌‌‌ను సందర్శించి విద్యుత్ రంగంపై అవగాహన పెంచుకోవాలని సీఎండీ కోరారు.