రెండు గంటలకుపైగా ముంబై స్విచ్చాఫ్

రెండు గంటలకుపైగా ముంబై స్విచ్చాఫ్
  • కరెంటు సప్లై లేక అల్లాడిన జనం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రైన్లు
  • టాటా పవర్ ప్లాం టులో గ్రిడ్ ఫెయిల్యూర్ వల్లే పవర్ కట్: బెస్ట్
  • మధ్యాహ్నం 12 తర్వాత మెల్లగా సప్లై పునరుద్ధరణ
  • విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే

ముంబై: గడియారంలో పెద్ద ముల్లులా ప్రతిక్షణం పరిగెత్తే దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్నట్టుండి ‘స్విచ్చాఫ్’ అయింది. నగరమంతా స్తంభించిపోయింది. సోమవారం కరెంటు సరఫరా నిలిచిపోవడంతో మెట్రో, సబర్బన్, లోకల్ రైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ట్రాఫిక్ సిగ్నళ్లు ఆఫ్ అయిపోయాయి. ఆస్పత్రులు, ఆఫీసులు, వ్యాపార సంస్థలు, ఇండస్ట్రీల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇండ్లలోని జనం హీట్​కు తట్టుకోలేక విలవిల్లాడారు. టెక్నికల్ సమస్య వల్లే కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మహారాష్ట్ర పవర్ మినిస్టర్ నితిన్ రౌత్ చెప్పారు. మధ్యాహ్నం 12 తర్వాత సరఫరాను ప్రాంతాల వారీగా చేపట్టారు. అయితే సాయంత్రానికి కూడా చాలాచోట్ల పూర్తిగా కరెంటు సరఫరా ప్రారంభం కాలేదు. 2018 జూన్ లో కూడా ఇలానే పవర్ సప్లైలో అంతరాయం ఏర్పడింది.

ఉదయం 10 గంటల నుంచి..

పవర్ షార్టేజ్​తో ఉదయం 10.05 నిమిషాలకు వెస్టర్న్, సెంట్రల్ రైల్వేలో ట్రైన్లు ఆగిపోయాయి. తర్వాత చాలాచోట్ల కరెంటు సప్లై నిలిచింది. కొలబా,మాహిమ్, బాంద్రా, అంధేరి, కాందివలి, భాండూప్ తదితర ప్రాంతాల్లో చాలాసేపు పవర్ సప్లై వస్తూ పోతూ సతాయించింది. థానే, పాల్ఘడ్‌‌, రాయ్‌‌గఢ్‌‌ జిల్లాల్లోను పవర్ సప్లై నిలిచిపోయింది. దీంతో పవర్ సప్లైని పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. తర్వాత సెంట్రల్ రైల్వే హార్బర్ లైన్ నుంచి 10.55కి రైళ్ల సేవలు మెల్లగా మొదలయ్యాయి. తొలుత అత్యవసర సేవల్లో పాల్గొనే వర్కర్లను ట్రైన్లు గమ్యస్థానాలకు చేర్చాయి. మధ్యాహ్నం 12కు పవర్ సప్లైని ప్రాంతాల వారీగా పునరుద్ధరించారు. కరోనా పేషెంట్లను ట్రీట్​చేసే ఆస్పత్రుల్లో ఎక్కడా కరెంటు సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకున్నారు. మిగతా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సప్లై, ఇతర సేవల్లో సమస్యలు తలెత్తకుండా 8 గంటలపాటు నడిచేలా డీజిల్ సరఫరా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఐఎస్ చాహల్ ఆదేశించారు. ఎయిర్ పోర్ట్​లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి.

అసలేమైంది..

టాటా పవర్ ప్లాంటులో గ్రిడ్ ఫెయిల్యూర్ వల్లే పవర్ కట్ అయిందని బృహన్​ముంబై ఎలక్ట్రిక్ సప్లై, ట్రాన్స్ పోర్ట్(బెస్ట్) చెప్పింది. ‘‘టాటా పవర్ కంపెనీలో ఇన్​కమింగ్ ఎలక్ట్రిక్ సప్లై ఫెయిల్యూర్ వల్లే అంతరాయం కలిగింది” అని పేర్కొంది. మెయింటెనెన్స్ పనులు చేస్తుండగా మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్​మిషన్ కంపెనీ(ఎంఎస్ఈటీసీఎల్)కి చెందిన ఫెసిలిటీస్​లో సమస్య తలెత్తిందని రాష్ట్ర విద్యుత్ మంత్రి నితిన్ రౌత్ తెలిపారు. ‘‘ఎంఎస్ఈటీసీఎల్ కు చెందిన 400 కేవీ కల్వా–పడ్ఘా లైన్​లో మెయింటెనెన్స్ వర్క్ నడుస్తోంది. ఈ సమయంలో సర్క్యూట్ నంబర్ 2లో టెక్నికల్ లోపం తలెత్తింది. దీంతో మొత్తం లోడ్ సర్క్యూట్ నంబర్ 1పై పడింది. ఇది షట్ డౌన్​కు దారితీసింది” అని చెప్పారు.

అక్కడ ప్రైవేటు సప్లై

మహారాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఉత్పత్తి చేసే స్టేషన్ల నుంచి కల్వా సబ్‌‌స్టేషన్ వరకు పవర్​ను తీసుకువచ్చే బాధ్యత ఎంఎస్‌‌ఈటీసీఎల్ ది. ఇక్కడి నుంచి టాటా పవర్, అదానీ ఎలక్ట్రిసిటీ వంటి ప్రైవేటు పంపిణీ సంస్థలు వినియోగదారులకు కరెంటు సరఫరా చేస్తాయి.

విచారణకు ఆదేశించిన సీఎం ఠాక్రే

కరెంటు కట్ అవడంపై విచారణ చేపట్టాలని అధికారులను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. విద్యుత్ మంత్రి రౌత్, ముంబై మున్సిపల్ కమిషనర్ ఐఎస్ చాహల్ మాట్లాడారు. సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.

వీటిపై ఎఫెక్ట్

  •     సీసీటీవీలు, ట్రాఫిక్ సిగ్నళ్లు పని చేయలేదు. దీంతో చాలా చోట్ల ట్రాఫిక జాం అయింది.
  •     లోకల్ రైళ్లు ముంబైకి లైఫ్ లైన్ లాంటివి. పవర్ కట్ తో గంటకు పైగా రైళ్లు ఎక్కడికక్కడ ట్రాక్​లపై నిలిచిపోయాయి. మెట్రో, సబర్బన్ రైళ్లదీ ఇదే పరిస్థితి.
  •     ప్రభుత్వ ఆఫీసులు, వ్యాపార సం స్థల్లో సర్వీసులు నిలిచాయి. కొన్నిచోట్ల సెల్​ఫోన్ల వెలుగులో ఉద్యోగులు పనులు చేశారు.
  •     వర్క్ ఫ్రమ్ హోంచేస్తున్న ఉద్యో గులు అవస్థలు పడ్డారు. విద్యుత్ సరఫరా లేక బ్యాంకింగ్, ఫైనా న్స్, ఐటీ తదితర రంగాల్లో ఔట్​పుట్​పై ఎఫెక్ట్ పడింది.
  •     కొన్నిచోట్ల ఆఫీసుల్లో ఉద్యోగు లు లిఫ్టుల్లో చిక్కుకుపోయారు. కాసేపటి తర్వాత క్షేమంగా బయటపడ్డారు.
  •     బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లకు కరెం టు బాధ తప్పలేదు. అయితే ఆల్టర్నేటివ్ ఏర్పాట్లతో  కార్యక లాపాలు కొనసాగించాయి.
  •     కాల్ కనెక్షన్లు, డేటా కనెక్టివిటీలో సమస్యలు వచ్చినట్లు యూజర్లు ఫిర్యాదు చేశారు.