Hari Hara Veera Mallu: కీరవాణి లేకపోతే.. ‘హరిహర వీరమల్లు’ సినిమా లేదు

Hari Hara Veera Mallu: కీరవాణి లేకపోతే.. ‘హరిహర వీరమల్లు’ సినిమా లేదు

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో  ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా బుధవారం వైజాగ్‌‌లో ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది.  ఇక్కడే సత్యానంద్‌‌ గారి దగ్గర నటనలో ఓనమాలు దిద్దాను. నాకు ‘ఖుషి’లాంటి బ్లాక్ బస్టర్‌‌‌‌ ఇచ్చిన ఏఎమ్ రత్నం నాతో సినిమా చేయాలని ఇది స్టార్ట్‌‌ చేశారు. కానీ కొవిడ్‌తో పాటు నేనున్న రాజకీయ పరిస్థితుల వల్ల షూటింగ్‌ వాయిదాలు పడింది. అందుకే డిప్యూటీ సీఎంగా నా విధులకు ఆటంకం కలగకుండా తాత్కాలిక స్టూడియో ఏర్పాటుచేసి ఈ సినిమా, ‘ఓజీ’షూటింగ్స్ పూర్తిచేశా.

క్రిష్​ గారు మొదలుపెట్టిన ఈ సినిమాను జ్యోతికృష్ణ గారు తక్కువ సమయంలో ఎఫెక్టివ్‌‌గా పూర్తి చేశారు. ఆస్కార్ విన్నర్‌‌‌‌ కీరవాణి గారి సంగీతం లేకపోతే ఈ సినిమా లేదు. ఇక సినిమా అంటే నాకెంతో ప్యాషన్. సినిమాకు కుల, మతాలు లేవు. నియంతృత్వ పోకడలు ఉన్న వ్యక్తులను ఎదుర్కొనగలిగే శక్తి నాకు సినిమా, అభిమానులు ఇచ్చిందే.  సినిమాలు ఎంటర్‌‌‌‌టైన్ చేయడంతో పాటు ఎడ్యుకేట్ చేయాలని నమ్ముతాను. ప్రజా కంటకుడైన ఔరంగజేబు నుంచి కోహినూర్‌‌‌‌ వజ్రాన్ని ఎలా తిరిగి తీసుకొచ్చారనే నేపథ్యంలో సాగే ఈ కథలో సనాతన ధర్మం గురించి ఉంటుంది.

సనాతనం ధర్మం అనేది ఏ మతానికి వ్యతిరేకం కాదు.. అందరినీ కలిపేది. ఇక అభిమానుల కోసం గబ్బర్ సింగ్ లాంటి మరో భారీ విజయాన్ని ఇవ్వమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’అన్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, హీరోయిన్ నిధి అగర్వాల్, నటుడు రఘుబాబు, దర్శకుడు జ్యోతికృష్ణతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.