వరంగల్/ ధర్మసాగర్, వెలుగు: బాలవికాస గ్రామాల్లో పేదలకు తాగునీటిని అందించే క్రమంలో నీటి ప్లాంట్లకు విద్యుత్ సరఫరా విషయంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు.
శనివారం గ్రేటర్ వరంగల్ ఫాతిమా నగర్‍లోని బాలవికాస పీడీటీసీ సెంటర్లో ''తాగునీటి శుద్ధీకరణ పథక కమిటీల మహసభ' నిర్వహించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగిరెడ్డి శౌరిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటి అందించడమే లక్ష్యంగా బాలవికాస పనిచేయడం అభినందనీయమన్నారు.
మాజీ మంత్రి మాట్లాడుతూ బాలవికాస ప్లాంట్ నిర్వహణకు ఉచితంగా లేదా తక్కువ టారీఫ్ లో విద్యుత్ సేవలు ఇచ్చేలా అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. అంతకుముందు ఎంపీ కడియం కావ్య హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలో బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల కంపౌండ్ వాల్ నిర్మాణానికి, ఎస్సీ కాలనీలో వివోమహిళా భవనం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
