ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ బ్లాస్ట్‌లో 12 మంది చనిపోగా, 25 మందికి పైగా గాయపడ్డారు. కోర్టు కాంప్లెక్స్‌లో పార్క్ చేసి ఉంచిన కారు.. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి పక్కనున్న కొన్ని వాహనాలకు మంటలు అంటుకున్నాయి. దాదాపు 6 కిలోమీటర్ల మేర పేలుడు శబ్దం వినిపించింది.
ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. ఆ టైమ్‌లో చాలామంది లాయర్లు అక్కడ ఉన్నారని.. బాధితుల్లో ఎక్కువ మంది అడ్వొకేట్లు, కోర్టు సిబ్బందేనని పోలీసులు తెలిపారు. ‘‘నేను నా కారును పార్క్ చేసి కోర్టు లోపలికి వెళ్లాను. ఇంతలో భారీ శబ్దం వినిపించింది. రెండు డెడ్‌బాడీలు గాల్లోకి ఎగిరి గేట్ మీద పడ్డాయి. అక్కడున్న పలు కార్లకు మంటలు అంటుకున్నాయి” అని లాయర్ రుస్తం మాలిక్ తెలిపారు. కాగా, ఈ దాడికి తామే పాల్పడ్డామని ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు.
అఫ్గాన్ పనే: డిఫెన్స్ మినిస్టర్
ఇది ఆత్మాహుతి దాడేనని పాకిస్తాన్ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. ‘‘సూసైడ్ బాంబర్ నడుచుకుంటూ కోర్టు బిల్డింగులోకి రావాలని అనుకున్నాడు. పార్కింగ్ ఏరియాలో 10 నుంచి 15 నిమిషాలు వేచి చూశాడు. లోపలికి రావడం సాధ్యం కాకపోవడంతో మధ్యాహ్నం 12:39 గంటలకు తనను తాను అక్కడే పేల్చేసుకున్నాడు” అని చెప్పారు. పక్కనే పోలీస్ వెహికల్, ఇతర కార్లు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ దాడి వెనుక అఫ్గానిస్తాన్ హస్తం ఉందని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు. ‘‘మేం ఇప్పుడు యుద్ధ స్థితిలో ఉన్నాం. అది కేవలం అఫ్గాన్ బార్డర్, బలోచిస్తాన్‌లో మాత్రమే కాదు.. పాకిస్తాన్ అంతటా ఉన్నదని ఈ బాంబు దాడితో స్పష్టమవుతున్నది. మా ప్రజలను రక్షించేందుకు ఆర్మీ ప్రతిరోజు త్యాగాలు చేస్తున్నది” అని పేర్కొన్నారు. కాగా, బాంబు దాడిని పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు.
