టర్కీ, సిరియాల్లో భారీ భూకంపం.. 2,600 మంది మృతి

టర్కీ, సిరియాల్లో భారీ భూకంపం.. 2,600 మంది మృతి

అంకారా/అజ్మరిన్  : టర్కీ, సిరియా ఒకేరోజు మూడు భారీ భూకంపాలతో వణికిపోయాయి. ఈ దేశాల సరిహద్దుల్లోని నగరాల ప్రజలు గాఢనిద్రలో ఉండగా భూవిలయం సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నంలోపు  మూడుసార్లు భూకంపం రావడంతో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. దీంతో 2600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 6వేల మందికిపైగా గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. ఇంకెంతో మంది  భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  టర్కీ, సిరియాలలోని ప్రభావిత నగరాల్లో ఎక్కడ చూసినా బాధితుల హాహాకారాలు, అంబులెన్సుల సైరన్ల మోతలే వినిపించాయి. తమవారిని కోల్పోయి గుండెలవిసేలా రోదిస్తున్న బాధితుల దృశ్యాలే కనిపించాయి. ఇక టర్కీ పొరుగునే ఉన్న సైప్రస్, లెబనాన్​ దేశాల్లోని పలు ప్రాంతాల్లోనూ  భూప్రకంపనలు చోటుచేసుకున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. భూప్రకంపనలకు భయపడి లిబియాలోని బీరుట్, ట్రిపోలీ నగరాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని, భవనాల లోపలి నుంచి కార్లను తీసి బయట పెట్టుకున్నారని పేర్కొన్నారు.  

టర్కీలో 1,650 మంది మృతి 

టర్కీ, సిరియా దేశాల బార్డర్​కు ఆనుకొని ఉండే నగరాల్లో తెల్లవారుజామున (4.17 గంటలకు) సంభవించిన ఈ భూకంపం తీవ్రత  రిక్టర్​ స్కేల్​ పై అత్యధికంగా 7.8గా నమోదైంది. టర్కీలోని దియర్​ బకీర్, కిలిస్, అడానా, సాన్​ లియుర్ఫా, మలాత్యా, ఆదియామన్​, ఉస్మానియే, హయాతే నగరాలు భూకంపంతో బాగా ప్రభావితమయ్యాయి.  ఆ దేశంలోని 10 ప్రావిన్సుల పరిధిలో భూకంపం కారణంగా 1,650  మందికిపైగా మరణించగా, 11,119 మందికి గాయాలయ్యాయి. దాదాపు 3వేల భవనాలు ధ్వంసమయ్యాయి. ఈవివరాలను టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్​ స్వయంగా వెల్లడించారు. ఉదయం 10 .24 గంటలకు, మధ్యాహ్నం 1.24 గంటలకు మరో రెండుసార్లు టర్కీ, సిరియా బార్డర్​ లోని సిటీల్లో దాదాపు 45 సెకన్ల పాటు (7.7 తీవ్రతతో)  భూకంపాలు  చోటుచేసుకున్నాయి. అయితే  సోమవారం తెల్లవారుజామున 4.17 నుంచి మధ్యాహ్నంలోపు  టర్కీ, సిరియాల్లోని  వేర్వేరు నగరాల్లో దాదాపు 20సార్లు భూప్రకంపనలు సంభవించాయని సైంటిస్టులు వెల్లడించారు.  మొదటిసారి సంభవించిన భూకంప కేంద్రం  టర్కీలోని గాజియాన్​ టెప్​ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఇక రెండోసారి చోటుచేసుకున్న భూకంప కేంద్రం టర్కీలోని కహ్రామాన్​ మారస్ ప్రావిన్స్​ పజార్సిక్​ జిల్లాలో, మూడోసారి వచ్చిన భూకంప కేంద్రం టర్కీలోని ఎకినోజు పట్టణంలో ఉందని వెల్లడైంది. ప్రపంచంలో భూకంపాలు సంభవించే ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో టర్కీలో కూడా ఉంది. చివరగా 1999లో అక్కడ సంభవించిన భూకంపంలో 17వేల మందికిపైగా చనిపోయారు.  అంతకుముందు 1939లో టర్కీలో సంభవించిన మరో భూకంపంలో 33వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 

సిరియాలో 968 మంది మృతి

సిరియాలోని అలెప్పో, హమా, ఇద్లిబ్​, లతాకియా ప్రావిన్స్​లలోని చాలా భవనాలు కూలిపోయాయి. 968  మంది మృతిచెందగా, 1280 మందికి గాయాలయ్యాయని సిరియా ఆరోగ్యశాఖ ప్రకటించింది. సిరియాలోని మృతిచెందిన వారిలో దాదాపు 430 మంది రెబల్స్​ ఆధీనంలో ఉన్న ప్రాంతాల వారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
2200 ఏళ్ల కిందటి కోట కూలింది
టర్కీలోని 2200 ఏళ్ల కిందటి చారిత్రక గాజియన్​టెప్​ కోట కూడా ఈ భూకంపంలో దెబ్బతింది. సెంట్రల్​ షాహిన్ బే జిల్లాలోని ఈ కోట చుట్టూ ఉన్న గోడలు కూలిపోయాయి. భూకంపం ధాటికి గుట్టపై ఉన్న ఈ కోట శిథిలాలు రోడ్డుపైకి వచ్చి పడ్డాయి.  

అండగా ఉంటాం : మోడీ

టర్కీ,సిరియాల్లో భూకంపంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆ దేశాలకు అండగా ఉంటామన్నారు. వాటికి అవసరమైన సాయం అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు కోలుకోవాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి జైశంకర్​ కూడా విచారం వ్యక్తం చేశారు.

మెడికల్ టీమ్స్​ను ​పంపనున్న భారత్​

టర్కీ, సిరియాకు నేషనల్​ డిజాస్టర్​ రెస్పాన్స్ ​ఫోర్స్​ (ఎన్డీఆర్​ఎఫ్)కు చెందిన రెండు టీమ్స్​, డాక్టర్లు, పారామెడిక్స్​ తో కూడిన మెడికల్ ​టీమ్స్​, రిలీఫ్​ మెటీరియల్, మెడిసిన్​ పంపుతామని కేంద్రం తెలిపింది. ఎన్డీఆర్​ఎఫ్​ టీమ్​లలో 100 మంది చొప్పున సిబ్బంది ఉంటారని వారు సెర్చ్​, రెస్క్యూ ఆపరేషన్లలో సహకరిస్తారని చెప్పింది.

3 రోజుల ముందే చెప్పిన నెదర్లాండ్ సైంటిస్ట్.. 

టర్కీ, సిరియా భూకంపం గురించి సరిగ్గా 3 రోజుల ముందే నెదర్లాండ్స్ కు చెందిన  ప్రముఖ సోలార్​ సిస్టమ్​ జామెట్రీ సర్వే సంస్థ సైంటిస్ట్  ఫ్రాంక్​ హూగర్ ​బీట్స్ ​హెచ్చరించారు. త్వరలో టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్​ సరిహద్దు ప్రాంతాలలో రిక్టర్​ స్కేల్​ పై 7.5 తీవ్రతతో  భూకంపం రాబోతోందంటూ ఆయన ఫిబ్రవరి 3న సాయంత్రం 5.30 గంటలకు ట్వీట్​ చేశారు. అందులో భూకంపం వచ్చే అవకాశాలున్న దేశాలను పాయింట్​ చేస్తూ ప్రత్యేక మ్యాప్​ ను కూడా అటాచ్​ చేశారు. అయితే ఆయన ట్వీట్​ను అందరూ ఎగతాళి చేశారు.. నవ్వారు.. నువ్వేమైనా జోతిష్యుడివా అని ఫ్రాంక్​ హూగర్ ​బీట్స్​ను నెటిజెన్లు​ ప్రశ్నించారు.  చివరకు ఆయన చెప్పిందే నిజమవడంతో.. ఇప్పుడు ఆ సంచలన ట్వీట్​పై చర్చ జరుగుతోంది. భూమిలోపల ఎక్కడ ఒత్తిడి పెరుగుతోందో గుర్తించేందుకు.. రాతిపొరల కదలికలను సైంటిస్టులు పరిశీలిస్తారు. వాటి ఆధారంగానే భూకంపం హెచ్చరికలను జారీ చేస్తుంటారు. అయితే ఏ రోజు.. ఏ టైంలో భూకంపం వస్తుందనే విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పలేరట.