Prabhas Fauzi: హిట్లర్‌తో నేతాజీ భేటీ.. బ్రిటిష్ గుండెల్లో వణుకు పుట్టించే యోధుడిగా ప్రభాస్‌!

Prabhas Fauzi: హిట్లర్‌తో నేతాజీ భేటీ.. బ్రిటిష్ గుండెల్లో వణుకు పుట్టించే యోధుడిగా ప్రభాస్‌!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా 'ఫౌజీ'చిత్రబృందం అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా నుంచి విడుదలైన 'ఫైల్ నంబర్ 25' గ్లింప్స్‌ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ వీడియోలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ ప్రస్తావనతో పాటు ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

చర్చంతా ఆ భారతీయ గూఢచారి గురించే..

1942 మే 29.. బెర్లిన్.. మంచుతో కప్పుకున్న వీధుల్లో యుద్ధ వాహనాలు ప్రయాణించే నలుపు-తెలుపు దృశ్యాలతో గ్లింప్స్‌ ప్రారంభమవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, హిట్లర్‌ మధ్య జరిగిన చారిత్రక భేటీని గుర్తుచేస్తూ కథలోకి తీసుకెళ్లారు. అయితే వీరిద్దరి సంభాషణలో ప్రస్తావనకు వచ్చిన భారతీయ గూఢచారి ఎవరు? బ్రిటిష్ పాలకులకు సింహస్వప్నంగా మారిన ఆ యోధుడే ప్రభాస్‌నా? అనే ఆసక్తిని రేకెత్తించేలా సన్నివేశాలను రూపొందించారు.

బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

'ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్’' అంటూ ప్రభాస్‌ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్, భారీ రైఫిల్‌తో ఆయన కనిపించే తీరు, శత్రువులను హెచ్చరిస్తూ చెప్పే డైలాగ్స్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. నేతాజీ పాత్రలో మరాఠీ నటుడు సుబోధ్ భవే కనిపించడం మరో ప్రత్యేక ఆకర్షణ. గతంలో 'లోక్‌మాన్య: ఏక్ యుగపురుష్'లో బాలగంగాధర తిలక్‌గా నటించిన ఆయన, ఇప్పుడు నేతాజీగా కనిపించేందుకు సిద్ధమయ్యారు.

మార్చి 19న థియేటర్లలోకి 'ఫౌజీ'

గ్లింప్స్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. 2027 మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇమాన్వీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, టీ-సిరీస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానున్న 'ఫౌజీ'లో ప్రభాస్‌ పాత్ర వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చరిత్ర, దేశభక్తి, యాక్షన్‌ కలగలిసిన ఈ చిత్రం ప్రభాస్‌ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందేమో చూడాలి..