రెబల్ స్టార్ ప్రభాస్ అంటే కేవలం వెండితెరపై కనిపించే కటౌట్ మాత్రమే కాదు.. ఆయనొక నడిచే 'అన్నపూర్ణ'గా తోటి నటీనటుల ప్రశంసిస్తారు. ప్రభాస్ సెట్ లో ఉన్నారంటే .. అక్కడ భోజనాల పండగ జరగాల్సిందే. తనతో పనిచేసే నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఇంటి నుంచి రకరకాల వంటకాలు వండించి వడ్డించడం అలవాటు . అయితే లేటెస్ట్ గా డార్లింగ్ పంచుకున్న భోజనం ముచ్చట నెట్టింట వైరల్ అవుతోంది.
ముంబై సెట్‌లో 'చెన్నై' విందు!
ఇటీవల 'కపుల్ ఫ్రెండ్లీ' టీమ్ సంతోష్ శోభన్, మానస వారణాసితో జరిగిన చిట్ చాట్‌లో ఫుడ్ పై ప్రభాస్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్నప్పుడు సెట్‌లో ఈరోజు అందరికీ 'చీట్ డే' అని ప్రకటించారు. ఈ రోజు మీరు ఎవరూ క్యారేజీలు తెచ్చుకోవద్దు .. నేను మీకు స్పెషల్ ఫుడ్ తినిపిస్తాను అని మాటిచ్చారు. తీరా మధ్యాహ్నం అయ్యింది.. ఆకలి దంచుతోంది.. కానీ భోజనం జాడ లేదు. గంటలు గడుస్తున్నా ప్రభాస్ చెప్పిన ఆ 'స్పెషల్ ఫుడ్' రాకపోవడంతో చిత్ర యూనిట్ అంతా కంగారు పడ్డారు. ముంబైలో వందల కొద్దీ హోటళ్లు ఉండగా ఎందుకు ఇంత ఆలస్యం అవుతోందని ఆరా తీస్తే, అసలు విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు.
ALSO READ : 'KHxRK' గ్లింప్స్ రిలీజ్.. 46 ఏళ్ల తర్వాత ఒక్కటైన రజనీ-కమల్..!
విమానంలో వచ్చిన వేడి వేడి క్యారేజీలు
ఆర్డర్ చేసింది ముంబైలోని ఏ లోకల్ రెస్టారెంట్‌కో కాదు. ఆ భోజనం నేరుగా చెన్నై నుండి వస్తోందని చెప్పి అందిరిని షాక్ కు గురిచేశారు ప్రభాస్. అసలైన ఫ్లేవర్ రుచి కావాలని, చెన్నైలో బిర్యానీని వేడి వేడి క్యారేజీలలో ప్యాక్ చేయించి, ఒక వ్యక్తికి ఇచ్చి ప్రత్యేకంగా ఫ్లైట్ ఎక్కించి ముంబైలో సెట్ కు తెప్పించినట్లు ప్రభాస్ తెలిపారు. ఇది వినడానికి కాస్త క్రేజీగా అనిపించవచ్చు. కానీ నాకు ఒరిజినల్ రుచులంటే ప్రాణం. లోకల్‌గా దొరికే వాటికంటే, ఆ అసలైన రుచి కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత సేపైనా వేచి చూస్తాను అని ప్రభాస్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఆ ఫుడ్ తిన్న నటుడు ఓం రౌత్, నీలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు అని ఆశ్చర్యపోయారని తెలిపారు.
ప్రభాస్ కు ఇష్టమైన వంటకం ఇదే!
సాధారణంగా ప్రభాస్ అంటే మనకు 'హైదరాబాదీ బిర్యానీ' గుర్తుకొస్తుంది. కానీ ప్రభాస్ మనసు గెలుచుకుంది మాత్రం చెన్నై బిర్యానీ అట. అందులోని ఘాటు, పులుపు తనకు చాలా ఇష్టమని ఆయన తెలిపారు. అయితే, అందరూ అనుకుంటున్నట్టు ప్రభాస్ ఫేవరెట్ డిష్ బిర్యానీ కాదు. డార్లింగ్ కి అన్నిటికంటే ఇష్టమైన వంటకం 'రొయ్యల పులావ్' . కోస్తా తీర ప్రాంతపు మసాలాలతో, ఘాటైన రుచితో ఉండే ఈ పులావ్ అంటే పడి చచ్చిపోతానని గతంలో తన ఇన్ స్టాగ్రామ్ లో కూడా తెలిపారు.
