PrabhasHanu: డార్లింగ్ బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్..

PrabhasHanu: డార్లింగ్ బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్..

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్పై భారీ అంచనాలున్నాయి. గత నెలరోజుల నుంచి వీరిద్దరి కలయికపై ఆసక్తి పెంచే అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్.. తమ ఊహలకి రెక్కలు తొడుక్కుని ఆకాశపు అంచుల్లో విహరిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు.

‘సీతారామం’ వంటి కల్ట్ క్లాసిక్ పీరియాడిక్ డ్రామా తెరకెక్కించిన దర్శకుడు హను ఓ కారణమైతే.. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తుండటం మరో కారణం. ఈ క్రమంలో రెబల్ ఫ్యాన్స్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఎట్టకేలకు తమ ఊహలకు ప్రాణం పోస్తూ.. ప్రభాస్ పుట్టినరోజున (2025 అక్టోబర్ 23న) అప్డేట్ అందించారు మేకర్స్. 

‘ఫౌజీ’:

ప్రభాస్-హను మూవీకి ‘ఫౌజీ’ (FAUZI) అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'ఫౌజీ' అంటే 'సైనికుడు' అని అర్థం. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో ప్ర‌భాస్ చాలా సీరియ‌స్‌గా చూస్తున్న‌ట్లుగా కనిపిస్తున్నారు. ‘‘పద్మవ్యూః విజేత పార్థ.. పాండవ పక్ష సంస్థి కర్ణః’’ ‘‘గురువిరహితః ఏకలవ్యః.. జన్మనైవ చ యోధుడు ఏషః’’ అనే సంస్కృత పంక్తులతో పోస్టర్ రిలీజ్ చేసి భారీ అంచనాలు పెంచారు. మన చరిత్రలోని దాగి ఉన్న అధ్యాయాల నుండి ఒక సైనికుడి ధైర్య కథను ఫౌజీలో చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

భారీ పిరియడ్ డ్రామాగా హను రాఘవపూడి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టును సుమారు రూ.400 కోట్ల బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా, కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజువల్స్, అద్భుతమైన నిర్మాణ విలువలతో రిలీజ్ చేయనున్నారు. 

డైరెక్టర్ హను రాఘవపూడి తన 'సీతారామం'తో చూపించిన అద్భుతమైన ఫీట్‌ను, ఈసారి మరింత పెద్ద స్కేల్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 'ఫౌజీ' కథనం 1940ల నాటి స్వాతంత్య్ర పూర్వ భారతంలో సాగుతుంది. బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలోని ఒక సైనికుడిగా ప్రభాస్ పాత్ర హైలైట్‌గా నిలవనుంది. దేశభక్తి, ప్రేమ, త్యాగం, స్వాతంత్ర్యం కోసం ఆ సైనికుడి ప్రయాణం ఎలా సాగింది అనే అంశాలతో కథనం గుండెలను కదిలించేలా ఉంటుందని సినీ వర్గాల సమాచారం.

పీరియడ్ హిస్టారికల్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్కు జంటగా ఇమాన్వి ఎస్మెయిల్ నటిస్తుంది. సీనియర్ నటులు జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి దిగ్గజాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీతారామం ఫేమ్' విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు, కృష్ణ కాంత్ లిరిక్స్ అందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా కమల్ కణ్ణన్, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ వంటి ఆరు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది.