
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఎంతటి రికార్డులు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా తెలుగువారి సత్తాను నలుదిశలా వ్యాప్తిచేసింది. అంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటిల 'బాహుబలి' కేవలం సినిమా సిరీస్‌గా మిగల్లేదు. ఒక అనిర్వచనీయమైన అనుభూతిగా, ఒక భావోద్వేగంగా స్థిరపడింది. మళ్లీ ఈ సినిమా సందడి మొదలైంది. తొలి భాగం విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా, మేకర్స్ 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఈ రెండు భాగాలను కొత్తగా ఎడిట్ చేసి, సాంకేతికంగా మెరుగుపరచిన ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
నార్త్ అమెరికన్ లో ముందస్తు జోరు..
ఈ 'బాహుబలి: ది ఎపిక్' చిత్రం భారతదేశంలో అక్టోబర్ 31, 2025న విడుదల కానుంది. అయితే, అమెరికా మార్కెట్‌లో మాత్రం అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా రెండు రోజుల ముందే, అక్టోబర్ 29నే ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ షోల టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 2017లో విడుదలైన 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' నార్త్ అమెరికన్ మార్కెట్‌లో 22 మిలియన్ డాలర్లను వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా తన స్థానాన్ని ఇప్పటికీ పదిలంగా ఉంచుకుంది. ఈ రికార్డుకు ఏ ఇతర సినిమా కూడా దగ్గరగా రాలేదు. దీంతో, సుమారు 3 గంటల 40 నిమిషాల నుంచి 3 గంటల 42 నిమిషాల నిడివితో వస్తున్న ఈ రీ-ఎడిటెడ్ వెర్షన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికన్ మార్కెట్ లో టికెట్ల అమ్మకాలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే, 60,000 డాలర్లకు పైగా వసూలు చేసింది. దాదాపు 100 షోలలో 3000కు పైగా టికెట్లు అమ్ముడవడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తెలియజేస్తోంది.
మరింత సాంకేతికను జోడించి..
తమ ముఖ్య లక్ష్యం ఈ చిత్రం మాయాజాలాన్ని మళ్లీ వెండితెరపైకి చూపించడమే అని నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు. డబ్బు సంపాదించడమే తమ ప్రధాన దృష్టి కాదన్నారు. గత పదేళ్లలో సినిమా ప్రదర్శనలో ఎన్నో మార్పులు వచ్చాయి. 'బహుబలి' తొలి భాగం రిలీజ్ టైమ్ లో 4DX , IMAX వంటి సౌకర్యాలు లేవు. కానీ ఇ ప్పుడు ఈ రెండు భాగాలను కలిపి , ఇతర ప్రీమియం లార్జ్ ఫార్మట్ లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్.. ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు 'బహుబలి' ని చూశారు. పదేళ్ల క్రితం థియేటర్లలో చూసిన వాళ్లు కూడా ఇప్పుడు ఈ చిత్రాన్ని మరో సారి చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఇప్పుడు వారు కోరుకున్నట్లుగానే ఒక లార్జర్ దాన్ లైఫ్ అనుభూతిని థియేటర్లలో చూసేలా తీర్చిదిద్దామని వెల్లడించారు.
►ALSO READ | ఫేక్ ఐడీలతో టార్గెట్: కించ పరచాలని, కిందకు తొక్కాలని చూస్తున్నారు: ‘మిత్ర మండలి’ హీరో దర్శి కామెంట్స్ వైరల్
మహిష్మతి , కుంతల రాజ్యాల వైభవాన్ని, ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి దిగ్గజాల అద్భుత ప్రదర్శనను ఈ సరికొత్త రూపంలో మళ్ళీ చూసేందుకు సినీ ప్రేక్షకులు ఆకస్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ 'ది ఎపిక్' వెర్షన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని, ఇది కేవలం రీ-రిలీజ్ కాదని, రాజమౌళి చేస్తున్న ఒక కొత్త ప్రయోగం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.