
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా దర్శకుడు ఓం రౌత్(Om raut) తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం'ఆదిపురుష్(Adipurush)'. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 శుక్రవారం విడుదలైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. జై శ్రీరామ్ నినాదాలతో ప్రభాస్ ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ప్రభాస్ కటౌట్స్ కు పూల మాలలు వేసి, పాలాభిషేకాలు చేస్తున్నారు.
అయితే కొన్ని థియేటర్స్ వద్ద మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని జ్యోతి థియేటర్లో ఆదిపురుష్ సినిమా ఆలస్యంగా వేశారని థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగారు ఫ్యాన్స్. ఇక సినిమా ప్రారంభం అయ్యాక సౌండ్ సిస్టం సరిగా లేకపోవడంతో మళ్లీ గొడవకు దిగి థియేటర్ అద్దాలను పగలగొట్టారు. దీంతో థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శనను నిలిపేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.