Prabhas 'ది రాజా సాబ్' షూటింగ్ పూర్తి.. మారుతి ఎమోషనల్ పోస్ట్.. రిలీజ్ ఎప్పుడంటే?

Prabhas 'ది రాజా సాబ్' షూటింగ్ పూర్తి.. మారుతి ఎమోషనల్ పోస్ట్.. రిలీజ్ ఎప్పుడంటే?

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ' ది రాజా సాబ్ '.  ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో  ఆసక్తిగా ఎదురుచూస్తున్న కీలక అప్టేడ్ ఒకటి వచ్చేంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టు కీలక అడుగు వేయడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి సోషల్ మీడియా వేదికగా సరికొత్త పోస్టర్ ను విడుదల చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచారు.  తమ విజయవంతమైన ప్రయాణం గురించి తన ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ గా పోస్ట్  చేశారు.

హృదయపూర్వక సందేశం..

మారుతి విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్ కొత్త లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాసిన పోస్ట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 23 సంవత్సరాల క్రితం ఆయన మొదటి సినిమా విడుదలైంది. సరిగ్గా అదే రోజు, ఈ రోజు ఆయన #TheRajaSaabలో తన ప్రయాణాన్ని ముగించారు... ఆయన విజయ ప్రయాణంలో భాగమైనందుకు నేను కృతజ్ఞుడిని, సంతోషంగా ఉన్నాను. 'ది రాజా సాబ్' ఖచ్చితంగా చాలా భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. మీరు మాపై చూపించే ప్రేమ, ఆత్రుత మాకు తెలుసు. మీకు అత్యుత్తమమైనది మాత్రమే అందిస్తామని మేము హామీ ఇస్తున్నాము. మా రెబల్ గాడ్ అభిమానులకు ముందు ముందు మరిన్ని వేడుకల రోజులు ఉన్నాయి అని  పోస్ట్ చేశారు. 

 

'ది రాజా సాబ్' కథా నేపథ్యం

'ది రాజా సాబ్' ఒక హారర్, కామెడీ, ఫాంటసీ అంశాలు కలగలిపిన చిత్రం. ఈ కథలో దేని గురించీ పట్టించుకోని వ్యక్తిగా ప్రభాస్ కనిపిస్తారు. తాను ప్రేమించిన అమ్మాయి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఒక పాడుబడిన భవనంలోకి వెళతాడు. అక్కడ అతనికి దెయ్యాలు, భయంకరమైన జీవులు, అలాగే ఆ ఇంటిలోని నిధిని కాపలా కాసే ఓ రహస్యమైన రాజు (మిస్టీరియస్ కింగ్) ఎదురవుతాడు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో అతీత శక్తులు కలిగిన భయంకరమైన వ్యక్తిగా కనిపించనున్నట్లు సమాచారం. ఆయన పాత్ర సినిమాకు మరింత భయానక వాతావరణాన్ని జోడిస్తుంది. విడుదలైన ట్రైలర్ గ్రిప్పింగ్ గోతిక విజువల్స్, విభిన్నమైన హాస్యం, ఫాంటసీతో కూడిన కథాంశాన్ని సూచించింది. వీటికి తోడు అద్భుతమైన VFX ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి.

తారాగణం ..

ఈ సినిమాలో నిధి అగర్వాల్ , రిద్ధి కుమార్ ప్రధాన కథానాయికలుగా నటిస్తున్నారు. వీరితో పాటు బోమన్ ఇరానీ, జరీనా వహాబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, విటివి గణేష్, యోగి బాబు, సప్తగిరి, సుప్రీత్ రెడ్డి, వరలక్ష్మి శరత్‌కుమార్, జిష్షు సేన్‌గుప్తా వంటి భారీ తారాగణం ఉంది. 'ది రాజా సాబ్' తర్వాత ప్రభాస్ నుంచి రాబోయే ప్రాజెక్టులలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్', హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'కల్కి 2898 ఏడీ పార్ట్ 2' ఉన్నాయి. 'ది రాజా సాబ్' షూటింగ్ పూర్తి కావడం, పోస్ట్ ప్రొడక్షన్ మొదలు కావడంతో, త్వరలోనే అధికారిక విడుదల తేదీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అటు అభిమానులు ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.