ఓస్లో: నార్వే చెస్ టోర్నీలో భారత యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. బుధవారం (జూన్ 3) ఓస్లోలో జరిగిన ఎనిమిదో రౌండ్‌లో ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ క్లార్సన్ను ఓడించాడు. తద్వారా ఒకే టోర్నమెంట్‌లో కార్ల్‌సెన్‌ను రెండుసార్లు మట్టికరిపించిన భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 19 ఏళ్ల చారిత్రాత్మక రికార్డ్‌ను ప్రజ్ఞానంద సమం చేశాడు.
2007లో జరిగిన లినారెస్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో కార్ల్‌సెన్‌ను విశ్వనాథన్ ఆనంద్ రెండుసార్లు ఓడించారు. 19 ఏళ్ల తర్వాత నార్వే టోర్నీలో ప్రజ్ఞానంద క్లార్సన్ను రెండు సార్లు ఓడించి రికార్డ్‌ను ఈక్వల్ చేశాడు. 2026, మే 27న జరిగిన మూడవ రౌండ్‌లో తెల్ల పావులతో కార్ల్‌సెన్‌ను చిత్తుచేసిన ప్రజ్ఞానంద.. ఎనిమిదో రౌండ్‌లో నల్ల పావులతో నార్వే ఆటగాడిని బోల్తా కొట్టించాడు.
అంతేకాకుండా ఈ ఏడాది క్లాసికల్ గేమ్‌లలో కార్ల్‌సెన్‌ను రెండుసార్లు ఓడించిన ఏకైక ఆటగాడి కూడా ప్రజ్ఞానంద కావడం మరో విశేషం. తాజా గెలుపుతో టైటిల్ రేసులో ప్రజ్ఞానంద మరింత ముందుకు దూసుకెళ్లాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతూ నార్వే చెస్ టైటిల్‌పై కన్నేశాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్ కైవసం చేసుకోవడానికి రెండు అడుగుల దూరంలో ఉన్నాడు. మరోవైపు ఈ సీజన్‌లో నాలుగు క్లాసికల్ గేమ్‌లలో ఓడిపోయిన కార్ల్‌సెన్‌కు టైటిల్ ఆశలు గల్లంతయ్యాయి.
