దేశాభివృద్ధే మోదీ ధ్యేయం : ప్రహ్లాద్ జోషి

దేశాభివృద్ధే మోదీ ధ్యేయం : ప్రహ్లాద్ జోషి

శంషాబాద్, వెలుగు :  దేశ సంపదను ప్రజలకు అందజేయడం, భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ప్రధాని మోదీ ధ్యేయమని కేంద్రమంత్రి ప్రహ్లాద జోషి పేర్కొన్నారు. గురువారం శంషాబాద్, మహేశ్వరం మండలాల్లో కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేయగా.. పెద్ద తుప్పరలో పంచాయతీ వద్ద కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రహ్లాద్ జోషి పాల్గొని మాట్లాడారు. 

కాంగ్రెస్ పాలనలో  దేశవ్యాప్తంగా తీవ్రవాదులు బాంబుదాడులకు తెగపడ్డారని, దీనికి ఆ పార్టీ  కారణమని ఆరోపించారు.  ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక ఘటన కూడా జరగలేదని, నేడు తీవ్రవాదం తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరిందని వ్యాఖ్యానించారు. పెద్దతుప్పర సర్పంచ్ చిటికెల వెంకటయ్య కేంద్రమంత్రికి స్వాగతం పలికి శాలువాతో సన్మానించి మేక పిల్లను బహుకరించారు.  

అనంతరం ఎంపీపీ జయమ్మ కేంద్ర మంత్రిని సన్మానించి డైరీని బహుకరించారు. మహిళా గ్రూపు సంఘాలకు 3 గ్రూపుల్లో ఒక్కొక్క గ్రూప్ కి రూ. 20 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు.  హెల్త్ క్యాంప్, బ్యాంక్ లోన్ క్యాంప్ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ క్యాంపులను పరిశీలించారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం, రాజేంద్రనగర్ కాంటెస్టెంట్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రేమ్ రాజు యాదవ్, జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, బరోడా బ్యాంక్ హైదరాబాద్ జోనల్ మేనేజర్ రితీశ్​కుమార్, డీజీఎం పీకే మోహన్ దాస్, డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, డిప్యూటీ డైరెక్టర్ సృజన్  పాల్గొన్నారు.