హత్యలు, కబ్జాలు పెరిగిపోయినయ్: బండి సంజయ్
పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్
ఖమ్మంలో సాయి గణేశ్ కుటుంబానికి మరో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పరామర్శ.. హైదరాబాద్లో గవర్నర్ను కలిసిన బీజేపీ లీడర్లు
గద్వాల, వెలుగు: రాష్ట్రంలో నిజాం పాలనను మించిన అరాచకాలను నయా నిజాం సీఎం కేసీఆర్ చేస్తుండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తప్పులు చేస్తున్న టీఆర్ఎస్ వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. బుధవారం ఉదయం ప్రజా సంగ్రామ యాత్రకు ముందు మల్దకల్ పాదయాత్ర శిబిరం వద్ద టీఆర్ఎస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా నోటికి నల్ల బట్ట కట్టుకొని ఆయన నిరసన దీక్ష చేపట్టారు. బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ కూడా దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ మరణవాంగ్మూలం ఇచ్చినా పోలీసులు కేసు పెట్టకపోవడం సిగ్గుచేటన్నారు. సాయి బతికుంటే ఈ రోజు పెండ్లి చేసుకునేవాడని గుర్తు చేశారు. కేసీఆర్ దిగి వచ్చి సాయి గణేశ్ కేసుపై సీబీఐ దర్యాప్తును కోరి, తప్పును సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో హత్యలు, అరాచకాలు, దౌర్జన్యాలు, కబ్జాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైన వాళ్లందరికీ శిక్ష పడేంత వరకూ బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.
జనం రాళ్లతో కొడ్తరు
అంబేద్కర్ ను అవమానిస్తే ప్రజలే రాళ్లతో కొడతారని సంజయ్ అన్నారు. బుధవారం ఏడో రోజు పాదయాత్రను జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రం నుంచి ప్రారంభించి సద్దనోనిపల్లె, అమరవాయి, పెద్దపల్లి బూడిదపాడు, కురువ పల్లె స్టేజీ వరకు కొనసాగించారు. పాదయాత్రలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, జలశక్తి శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పాల్గొని 5 కిలోమీటర్లు నడిచారు. బావులకు కరెంటు ఫ్రీ అంటూనే సీఎం కేసీఆర్ ఇండ్లకు కరెంటు బిల్లుల మోత మోగిస్తున్నారని సంజయ్ అన్నారు. బీజేపీకి పేరు వస్తుందన్న కుట్రతో ప్రధాని ఆవాస్ యోజన కింద లక్షా నలభై వేల ఇండ్లను తెచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి వచ్చిందని, ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని డీకే అరుణ పిలుపునిచ్చారు.
కూలీలతో కలిసి సద్ది తింటూ..
లంచ్ బ్రేక్ సమయంలో పెద్దపల్లి విలేజ్ సమీపంలో పంటపొలాల దగ్గర కూలీలతో కలిసి సంజయ్ సద్దిని తిన్నారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తో కలిసి బీడు పడిన పంట పొలాలను పరిశీలించారు. పాదయాత్రలో లో బీజేపీ నేతలు బండ కార్తీక రెడ్డి, వీరేందర్ గౌడ్, ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.
