ఫస్ట్ హాఫ్‌‌లో ప్రజాప్రభుత్వం సక్సెస్‌‌ :  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ఫస్ట్ హాఫ్‌‌లో ప్రజాప్రభుత్వం సక్సెస్‌‌ :  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ/ వేములవాడ రూరల్‌‌, వెలుగు: సీఎం రేవంత్‌‌రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వంలో ఫస్ట్ హాఫ్ విజయవంతంగా పూర్తయిందని, కానీ ప్రతిపక్ష బీఆర్‌‌‌‌ఎస్‌‌ కావాలని రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో పట్టణ ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఇందిరమ్మ కమిటీ సభ్యులు పేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూడాలన్నారు. కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోండగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని, అందుకే ప్రజలు కాంగ్రెస్‌‌కు అధికారం అప్పగించారన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు ఇప్పటికే తగిన గుణపాఠం చెప్పారన్నారు. రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హన్మాజీపేటలో మీడియాతో మాట్లాడుతూ వాస్తవాలకు దగ్గరగా మాట్లాడి ప్రజల మన్ననలు పొందాలి కానీ ప్రతిపక్ష పార్టీల లీడర్లు అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టారని గుర్తుచేశారు.

మొదటి ఆరు నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా విఫలమైందన్నారు. గత ఎన్నికల్లో 100 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు ఏ పార్టీ నుంచి పోటీ ఉండదన్నారు. 14 ఏండ్ల క్రితమే ఎస్సారెస్పీ నుంచి నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్సేనని, జీవన్‌‌ రెడ్డి మాటలు వింటే వైఎస్సార్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వకుళాభరణం శ్రీనివాస్, చెన్నాడి శ్యామల, గోవర్ధన్, ఎల్లగౌడ్, రవి, రాంరెడ్డి పాల్గొన్నారు.