ప్రారంభమైన ప్రజా సంగ్రామ యాత్ర

ప్రారంభమైన ప్రజా సంగ్రామ యాత్ర
  • యాదగిరిగుట్టలో జెండా ఊపిన  కేంద్రమంత్రి షెకావత్‌‌‌‌
  •  బహిరంగ సభకు హాజరైన పలువురు లీడర్లు

యాదగిరిగుట్ట/రాజాపేట, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో స్టార్ట్‌‌‌‌ అయింది. ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌‌‌‌ షెకావత్‌‌‌‌, కిషన్‌‌‌‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌‌‌‌ వెంకటస్వామి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ, ఎమ్మెల్యే రఘునందన్‌‌‌‌రావు, ఈటల రాజేందర్‌‌‌‌ హాజరయ్యారు. ముందుగా లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదగిరిగుట్టలో నిర్వహించిన బహిరంగ సభలో పలువురు మాట్లాడారు. తర్వాత 3.50 గంటలకు బహిరంగ సభా స్థలం వద్ద కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌‌‌‌ షెకావత్‌‌‌‌ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. యాదగిరిపల్లి నుంచి యాదగిరిగుట్ట, పాతగుట్ట, గొల్లగుడిసెలు మీదుగా దాతరుపల్లి వరకు పాదయాత్ర నిర్వహించి గ్రామ శివారులో బస చేశారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌‌‌‌రావు ఉన్నారు.

సంపాదనపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు

టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి దూరమైందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌‌‌‌రావు, ఆ పార్టీ స్టేట్‌‌‌‌ లీడర్లు గూడూరు నారాయణరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం సందర్భంగా యాదగిరిగుట్టలో జరిగిన మీటింగ్‌‌‌‌లో వారు మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పైసలు సంపాదించడంలో ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నియంతృత్వ పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ దందాలతో ఎమ్మెల్యేలు కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకే యాదగిరిగుట్ట స్వరూపాన్ని మార్చేశారన్నారు. గుట్ట అభివృద్ధిలో భాగంగా ఇండ్లు, షాపులు కోల్పోయిన వారిని పట్టించుకోకపోవడంతో వారంతా రోడ్డున పడ్డారని, 300 మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలేరు నియోజకవర్గంలో ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి జరగలేదని, యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన తెలంగాణలో ఆలేరుకు ఒక్క చుక్క తాగునీరు కూడా రప్పించలేకపోయారన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి గుట్ట పునర్నిర్మాణంలో క్వాలిటీని పట్టించుకోని సీఎం కేసీఆర్‌‌‌‌ను లక్ష్మీనరసింహస్వామి కూడా క్షమించరన్నారు.  ల్యాండ్‌‌‌‌, శాండ్‌‌‌‌ మాఫియాకు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు అడ్డాగా మారిందని, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారన్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ ఆఫీసర్లు

యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌‌ షెకావత్‌‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌ పట్ల ఆలయ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా వీఐపీలు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా  ప్రధానాలయ పశ్చిమ రాజగోపురం వైపు చేరుకునేందుకు ప్రత్యేకంగా లిఫ్ట్‌‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం వచ్చిన గజేంద్ర సింగ్‌‌ షెకావత్‌‌, బండి సంజయ్‌‌ ఇదే లిఫ్ట్‌‌లో ఆలయంలోకి వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వచ్చే టైంలో లిఫ్టు ఉన్న రూం తలుపులు మూసి ఉండడంతో వారు 10 నిమిషాల పాటు అక్కడే వేచి ఉన్నారు. చివరకు ఎస్‌‌పీఎఫ్‌‌ పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న ఆలయ ఆఫీసర్లు వచ్చి లిఫ్ట్‌‌ తలుపులు తెరిచారు. ప్రముఖులు వచ్చిన టైంలో లిఫ్ట్‌‌ రూం మూసివేయడంపై బీజేపీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రితో పాటు జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినా ప్రొటోకాల్‌‌ పాటించకుండా అవమానించారని మండిపడ్డారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేశారు. 

యాత్రకు తరలిన బీజేపీ లీడర్లు

సూర్యాపేట/నార్కట్‌‌‌‌పల్లి, వెలుగు : యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ప్రారంభమైన ప్రజాసంగ్రామ యాత్ర, బహిరంగ సభకు సూర్యాపేట, నార్కట్‌‌‌‌పల్లి నుంచి బీజేపీ లీడర్లు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. సూర్యాపేట నుంచి బయలుదేరిన వాహనాలను ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌‌‌‌రావు జెండా ఊపి ప్రారంభించారు. నార్కట్‌‌‌‌పల్లి నుంచి మండల అధ్యక్షుడు కొరివి శంకర్‌‌‌‌, నియోజకవర్గ కన్వీనర్‌‌‌‌ మండల వెంకన్న, మండల ఇన్‌‌‌‌చార్జి పూతపాక లింగస్వామి ఆధ్వర్యంలో  తరలివెళ్లారు. 

జేబుదొంగల చేతివాటం

యాదగిరిగుట్టలో మంగళవారం నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. కొండపై ఓ బీజేపీ కార్యకర్త జేబులోంచి రూ.10 వేలు దొంగిలించారు. అనంతరం ఓ రిపోర్టర్‌‌‌‌ జేబులోంచి డబ్బులను తీసేందుకు యత్నిస్తుండగా  గమనించిన అతడు వెంటనే ఎస్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ పోలీసులకు విషయం చెప్పాడు. దీంతో వారు దొంగను అదుపులోకి తీసుకొని గుట్ట పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు తరలించారు. 

బీజేపీలో చేరిన నాయకులు

యాదగిరిగుట్టలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పలువురు పార్టీలో చేరారు. ప్రముఖ లాయర్‌‌‌‌ రచనారెడ్డి, రైస్‌‌‌‌ మిల్లర్ల అసోసియేషన్‌‌‌‌ రాష్ట్ర నాయకుడు మోహన్‌‌‌‌రెడ్డి బీజేపీలో చేరడంతో వారికి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌‌‌‌ షెకావత్‌‌‌‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌ పార్టీ కండువా కప్పారు. అలాగే యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన కోల వెంకటేశ్‌‌‌‌తో పాటు పలువురు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌‌‌‌ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.