- వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలి: ప్రకాశ్ కారత్
- ముగిసిన రాజకీయ శిక్షణ తరగతులు
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీపై రాజకీయంగా, సైద్ధాంతికంగా పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పిలుపునిచ్చారు. ఇందుకోసం వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమైన సీపీఎం అఖిల భారత స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు మంగళవారం ముగిశాయి. ఈ నెల 23న ప్రారంభమైన ఈ శిక్షణ ఆరు రోజుల పాటు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రకాశ్ కారత్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ (ఈసీ) రాజకీయ ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. 12 రాష్ట్రాల్లో ‘సర్’ను అమలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు.
సర్‌పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని, ఇంకా తుది తీర్పు వెల్లడించలేదని గుర్తుచేశారు. ఈసీ స్వతంత్రంగా వ్యవహరించాలని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ శిక్షణ తరగతులను క్రమం తప్పకుండా నిర్వహించాలని, పార్టీ బలోపేతం చేయడంతో పాటు సభ్యత్వాలను పెంచాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
లౌకిక శక్తులను ఒక వేదిక మీదకు తేవడమే లక్ష్యం: రాఘవులు
రాబోయే కాలంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం కావాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీబీ రాఘవులు అన్నారు. లౌకిక శక్తులన్నింటినీ ఒక వేదిక మీదకు తేవడం లక్ష్యమని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న విద్యార్థి సంఘాల రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
