ఒక్కడే 400 కొట్టేశాడు.. ఎవరీ ప్రఖర్ చతుర్వేది..?

ఒక్కడే 400 కొట్టేశాడు.. ఎవరీ ప్రఖర్ చతుర్వేది..?

ఫార్మాట్ ఏదైనా.. సెంచరీ అనేది ఆటగాడి కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. డబుల్, సెంచరీ ట్రిపుల్ సెంచరీలు కొట్టాలంటే ఎంతో టాలెంట్ తో పాటు ఓపిక కూడా కావాలి. కానీ కర్ణాటక కుర్రాడు ప్రఖర్ చతుర్వేది ఏకంగా 400 కొట్టేశాడు. క్రికెట్ లో 400 అనగానే అందరికీ విండీస్ దిగ్గజం బ్రియాన్ లారనే గుర్తుకొస్తాడు. అయితే మన ఇండియాలో కూడా ఒక యువ బ్యాటర్ ఒకే ఇన్నింగ్స్ లో 400 బాదేసి అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్నాడు.    

బీసీసీఐ అండర్‌-19 టోర్నీ కూచ్‌ బెహార్‌ ట్రోఫీ ఫైనల్‌లో కర్ణాటక ఆటగాడు ప్రఖర్ చతుర్వేది క్వాడ్రాపుల్ సెంచరీ కొట్టాడు. నేడు (జనవరి 15) కేఎస్‌సీఏ స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 404 పరుగులు చేసి కూచ్‌ బెహార్‌ ట్రోఫీలో ఈ  ఘనత అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. చతుర్వేది ఇన్నింగ్స్ లో 46 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ యువ ఆటగాడి ధాటికి ఆతిధ్య కర్ణాటక 223 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 890 పరుగుల భారీ స్కోర్ చేసింది.     

హర్షిల్ ధర్మాని (228 బంతుల్లో 169)తో కలిసి రెండో వికెట్‌కు 290 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని.. 10వ నంబర్ బ్యాటర్ సమర్థ్ తో కలిసి   తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 163 పరుగులు జోడించారు.మరోవైపు ముంబై తొలి ఇన్నింగ్స్ లో 380 పరుగులకే ఆలౌటైంది. 11 సంవత్సరాల వయస్సు నుండి  చతుర్వేది క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. 2017 నుండి SIX క్రికెట్ అకాడమీలో ఉంటున్నాడు. ఈ అకాడమీ బెంగళూరులోని పదుకొనే-ద్రావిడ్ సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌లో ఉంది.