
హైదరాబాద్, వెలుగు: ఫేక్ అటెండెన్స్ వేసిన పంచాయతీ సెక్రటరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి శాఖ(పీఆర్ అండ్ ఆర్డీ) హెచ్చరించింది. ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానంలో తప్పుడు ఫొటోలు అప్‌లోడ్ చేయడం, ఇతర వ్యక్తుల ఫొటోలను లేదా నాన్-లైవ్ ఇమేజ్‌లను ఉపయోగించి మోసపూరితంగా హాజరు నమోదు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
దీనిపై పీఆర్ అండ్ ఆర్డీ మార్గదర్శకాలు జారీ చేసింది. మండల పంచాయతీ అధికారులు (ఎంపీవో) రోజూ పంచాయతీ సెక్రటరీల హాజరును పర్యవేక్షించాలి. నకిలీ హాజరును గుర్తిస్తే అదే రోజు ఇమేజ్ లాగ్‌లు, స్క్రీన్‌షాట్‌లతో సహా సాక్ష్యాలతో షోకాజ్ నోటీసు జారీ చేయాలి. దీనికి సెక్రటరీ మూడు రోజుల్లో వివరణ సమర్పించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.