Prasanth Varma: అడ్వాన్స్ వివాదంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. క్లారిటీ ఇచ్చిన DVV ఎంటర్‌టైన్‌మెంట్!

Prasanth Varma: అడ్వాన్స్ వివాదంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ..  క్లారిటీ ఇచ్చిన DVV ఎంటర్‌టైన్‌మెంట్!

'హనుమాన్' చిత్రంతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ప్రశాతం వర్మ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్నారు.  సోషల్ మీడియాలో ఆయనపై అనేక ఆరోపణలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా 'జై హనుమాన్', 'మహాకాళి' వంటి పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రకటించారు. కానీ గత 20 నెలలుగా వాటి గురించి పెద్దగా అప్డేట్ లు లేకపోవడంతో.. ఆయనపై వదంతులు వ్యాపించాయి. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి ప్రశాంత్ వర్మ పెద్ద మొత్తంలో అడ్వాన్స్ లు తీసుకుని.. ఆ ప్రాజెక్టులను ఆలస్యం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ నిధులను తన హైదరాబాద్ స్టూడియో కోసం మళ్లించారంటూ కథనాలు వెలువడ్డాయి. 

పుకార్లకు చెక్.. 

అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ.. శుక్రవారం అగ్ర నిర్మాణ సంస్థ DVV ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా స్పందించింది. పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్-ఎంటర్‌టైనర్ 'ఓజీ' (They Call Him OG) చిత్రాన్ని ఇటీవల నిర్మించిన ఈ బ్యానర్, తమ అధికారిక 'X' ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. DVV ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి దర్శకుడు ప్రశాంత్ వర్మ అడ్వాన్స్‌లు తీసుకున్నారని ఇటీవల వస్తున్న ఆరోపణలు పూర్తిగా ఆవాస్తవమని, నిరాధారమైనవి అని స్పష్టం చేసింది. ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందాలు గాని ,  ఆర్థిక లావాదేవీలు గాని జరగలేదని తేల్చి చెప్పింది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలని మీడియా సంస్థలను, సోషల్ మీడియా పేజీలను DVV ఎంటర్‌టైన్‌మెంట్ కోరింది..

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్..

వివాదం ఒకవైపు ఉన్నప్పటికీ, ప్రశాంత్ వర్మ తన కలల ప్రాజెక్ట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్  ను విస్తరించడంలో బిజీగా ఉన్నారు. ఈ యూనివర్స్‌లో మొదటి చిత్రం 'హనుమాన్' పెద్ద విజయాన్ని సాధించింది. PVCU నుండి రాబోతున్న ఈ నెక్స్ట్ ఛాప్టర్‌కు పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ భూమి శెట్టి 'మహాకాళి' పాత్రలో నటించనుంది. ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్ లుక్.. భయంకరమైన, దివ్యమైన శక్తిని ప్రదర్శిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ 50% పైగా పూర్తయిందని, ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా 'అసురగురు శుక్రాచార్యుడు' అనే కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం.

 'హనుమాన్' చిత్రానికి సీక్వెల్ గా జై హనుమాన్ (Jai Hanuman) రూపుదిద్దుకుంటోంది.. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి  కీలక పాత్ర పోషిస్తారని వార్తలు వస్తున్నాయి. కల్యాణ్ దాసరి, ఎస్.జె.సూర్య నటిస్తున్న అధీర చిత్రం కూడా PVCU లో భాగమే. ప్రస్తుతం తనపై వస్తున్న వదంతులపై ప్రశాంత్ వర్మ ఇంకా స్పందించనప్పటికీ, DVV ఎంటర్‌టైన్‌మెంట్ ఖండన ఈ విషయంలో కొంత స్పష్టతను ఇచ్చింది. మరి దీనిపై ప్రశాంత్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.