సీఎం అడ్వైజర్ పదవికి ప్రశాంత్ కిశోర్ రాజీనామా

సీఎం అడ్వైజర్ పదవికి ప్రశాంత్ కిశోర్ రాజీనామా

చండీగఢ్: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తనకు ఉన్న కేబినెట్ మంత్రి హోదా పదవికి రాజీనామా చేశారు. కొన్నాళ్లు ప్రజా జీవితానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో ఆయనను పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఒక్క రూపాయి గౌరవ వేతనంతో కేబినెట్ మంత్రి హోదా ఇస్తూ ఈ పదవిలో పీకేను అపాయింట్ చేశారు. ఉండడానికి ప్రభుత్వ బంగ్లా, సచివాలయంలో ఆఫీస్, ఆరుగురు సిబ్బంది, ఫ్రీ ట్రాన్స్​పోర్ట్, ఉచిత విమాన ప్రయాణం, టెలిఫోన్​, మెడికల్ ఫెసిలిటీస్​ లాంటివి కల్పించారు. ఈ పదవిలో పీకే గతంలో ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలతో కూడా సమావేశాలు నిర్వహించారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు అడ్వైజర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీఎం అమరీందర్ సింగ్​కు లేఖ పంపారు. ‘‘ప్రజా జీవితం నుంచి నేను స్వల్ప విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్న విషయం మీకు తెలిసిందే. నేను మీ ప్రిన్సిపుల్ అడ్వైజర్ బాధ్యతలు నిర్వహించలేకపోతున్నాను. ఈ బాధ్యతల నుంచి నన్ను రిలీవ్ చేయాల్సిందిగా కోరుతున్నాను” అని అందులో కోరారు. అయితే తన భవిష్యత్​ ప్రణాళికపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

కాంగ్రెస్​లో చేరుతున్నారా?

మరోవైపు ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరి యాక్టివ్​ పాలిటిక్స్​లోకి రాబోతున్నారని కొద్ది రోజులుగా ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్​లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో గత నెలలో వరుసగా భేటీలు అయిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తాను ఇక ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగబోనని ప్రకటించిన పీకే.. నేరుగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న చర్చ సాగుతోంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు తెర వెనుక ఉండి వ్యూహాలు వేయడమా లేక నేరుగా పార్టీలో చేరి మంత్రాంగం నడపడమా అన్న వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. ఆయనను పార్టీలోకి తీసుకుంటే కలిగే లాభనష్టాలపై కాంగ్రెస్ అధిష్ఠానం కూడా అంతర్గతంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.