బీజేపీ రెబల్ అభ్యర్థికి పీకే మద్దతు

బీజేపీ రెబల్ అభ్యర్థికి పీకే మద్దతు

గోపాల్‌‌‌‌గంజ్: బిహార్‌‌‌‌లోని గోపాల్‌‌‌‌గంజ్ లో బీజేపీ రెబల్​అభ్యర్థి అనూప్ కుమార్ శ్రీవాస్తవకు జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మద్దతు ప్రకటించారు. జన్ సురాజ్  అభ్యర్థి శశి శేఖర్ సిన్హా బీజేపీ ఒత్తిడి కారణంగా పోటీ నుంచి తప్పుకున్నారని పీకే ఆరోపించారు. గోపాల్‌‌‌‌గంజ్‌‌‌‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన అసంతృప్త నాయకులకు టికెట్లు ఇవ్వకూడదనే జన్ సురాజ్ పార్టీ నియమానికి ఇది మినహాయింపని, శ్రీవాస్తవ విషయంలో ప్రత్యేక పరిస్థితి ఉందన్నారు. 

శ్రీవాస్తవ సామాజిక కార్యకర్తగా, జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే, ఆర్థికంగా బలమైన వ్యక్తిని  నిలిపేందుకు బీజేపీ తనను పక్కనపెట్టిందని శ్రీవాస్తవ ఆరోపించారు. కాగా, జన్ సురాజ్ అభ్యర్థి శశి శేఖర్ సిన్హా..  వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.  కానీ, బీజేపీ ఒత్తిడి కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని కిషోర్ చెప్పారు. అందుకే అనూప్ కుమార్ శ్రీవాస్తవకు మద్దతిస్తున్నట్టు తెలిపారు.