నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వే

నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వే
  • ఏయే ఎన్నికల్లో ఎంత పంచారు?
  • ఫలితాలపై వాటి ప్రభావముందా?
  • నియోజకవర్గాల్లో సర్వే చేస్తున్న ప్రశాంత్ కిషోర్ టీమ్
  • జనంతోపాటు ఉద్యోగులు, సర్పంచ్‌లు, ఓడిన అభ్యర్థుల నుంచీ అభిప్రాయ సేకరణ

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో డబ్బు ప్రభావమెంత? నోట్లు పంచిన ఎఫెక్ట్ ఓటర్లపై ఎంత మేరకు ఉంటుంది? డబ్బులు తీసుకున్నోళ్లు ఎవరికి ఓటేస్తున్నారు?.. అని ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ టీమ్ రాష్ట్రంలో సర్వే చేస్తున్నది. ఏ పార్టీ, ఎంత డబ్బు పంచి పెట్టిందనే వివరాలను పలు నియోజకవర్గాల్లో నేరుగా ఓటర్లను అడిగి తెలుసుకుంటున్నది. ఇప్పటిదాకా జరిగిన వివిధ ఎన్నికల్లో ఏ అభ్యర్థి ఎంత ఖర్చు చేశారు? ఒక్కో ఓటుకు ఎంత ఇచ్చారు? ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారే గెలిచారా వంటి వివరాలను సేకరిస్తున్నది. 

గత ఏడాది రాష్ట్రంలో హోరాహోరీగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశంలోనే కాస్ట్‌‌లీ ఎలక్షన్‌‌గా రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలో పీకే టీమ్ ఓట్లకు నోట్లపై సర్వే చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ సెగ్మెంట్లలో ఆయన టీమ్ రంగంలోకి దిగింది.హైదరాబాద్ సిటీ మినహా రాష్ట్రంలోని రూరల్ నియోజకవర్గాల్లో వివరాలు సేకరిస్తున్నది. ఒక్కో పాత జిల్లా పరిధిలో ఎంపిక చేసిన రెండు, మూడు నియోజకవర్గాల్లో సర్వే చేస్తున్నది. ఆయా జిల్లాల్లో జనరల్ సీట్లతోపాటు రిజర్వుడు స్థానాల్లో చేపట్టిన సర్వేలో ఎమ్మెల్యేల పనితీరు, ఆ స్థాయి లీడర్ల సమాచారం సేకరించటంతో పాటు.. ఓటుకు నోట్ల పంపిణీ గురించి ఆరా తీస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఆరుగురు ఉద్యోగులు సర్వే చేస్తున్నారు. 
ఒక ప్రైవేట్ రూరల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినట్లు చెప్పుకుంటూ ఈ వివరాలు తెలుసుకుంటున్నారు.​ ప్రతి నియోజకవర్గంలో 80 శాతం జనాభా ఉండే ఏరియా కవరయ్యేలా సర్వే టీమ్‌లు ప్లాన్ చేసుకున్నాయి. దాదాపు 20 రోజుల పాటు సర్వే కొనసాగుతున్నది. మండల స్థాయిలో ఉన్న అన్ని ఆఫీసుల్లో ఉద్యోగులను కలవడంతో పాటు.. ప్రతి గ్రామంలో టీచర్లు, పంచాయతీ సభ్యులు, స్కూల్ సిబ్బంది, అంగన్​వాడీ, ఆశ కార్యకర్తలు, రైతు సమితుల ప్రతినిధులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గతంలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు. ఏజ్ గ్రూప్ వారీగా గ్రామాల్లో యూత్, మహిళలు, వృద్ధుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

ఓటు ‘ఖరీదు’ పెరుగుతూనే ఉన్నది
2018 డిసెంబర్‌‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 11ఎన్నికలు జరిగాయి. ప్రతి ఎన్నికలోనూ ఓటు ఖరీదు అంతకంతకు పెరిగిపోయింది. గెలిచేందుకు కొందరు క్యాండిడేట్లు ఎంతైనా పంచిపెడుతున్నరు.  2019 మార్చిలో జెడ్పీ ఎన్నికలు, సర్పంచ్, మండల పరిషత్ ఎన్నికలు, 2019 ఏప్రిల్‌లో లోక్​సభ ఎన్నికలు, అక్టోబర్‌‌లో హుజూర్‌‌నగర్ బై ఎలక్షన్, 2020 జనవరిలో మున్సిపల్ ఎలక్షన్లు, అదే ఏడాది నవంబర్‌‌లో దుబ్బాక బై ఎలక్షన్, డిసెంబర్‌‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. 2021 మార్చిలో ఎమ్మెల్సీ, ఏప్రిల్‌లో నాగార్జునసాగర్, అక్టోబర్‌‌లో హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగాయి. డిసెంబర్‌‌లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో జనరల్ సీట్లలో అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల నోట్లు పంపిణీ చేసేందుకు పోటీపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు రూ.కోటి వరకు ఖర్చు పెట్టారు. వీటికి తోడు లిక్కర్ బాటిళ్ల పంపిణీ, ఊరూరా, వీధివీధినా విందులు పెరిగిపోయాయి. గోల్డ్ రింగ్‌లు, గిఫ్ట్‌లు ఇచ్చేందుకు అభ్యర్థులు పోటీ పడ్డారు. అవన్నీ తలదన్నేలా హుజూరాబాద్ బై ఎలక్షన్‌లో ఎన్నికల ఖర్చు అందనంతగా పెరిగిపోయింది.

ఇక్కడి ఖర్చుపై దేశమంతా చర్చ
అసెంబ్లీ, లోక్‌సభ నుంచి గ్రామ పంచాయతీ వరకు.. ఎన్నిక ఏదైనా అభ్యర్థులు చేస్తున్న ఖర్చు అంచనాలకు అందనంతగా పెరిగిపోయింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు పోటాపోటీగా నోట్లు కుమ్మరిస్తున్నాయి. ఇక్కడి ఎన్నికల ఖర్చు తారాస్థాయికి చేరిందని దేశమంతటా చర్చ జరుగుతోంది. గత ఏడాది జరిగిన హుజూరాబాద్ బై ఎలక్షన్‌లో అధికార పార్టీ ఒక్కో ఓటరుకు రూ.6 వేల చొప్పున పంపిణీ చేసింది. ఉదయాన్నే పాల ప్యాకెట్లు వేసినట్లు ఇంటింటికీ నోట్ల కవర్లను హోమ్ డెలివరీ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. పార్టీలు పోటాపోటీగా డబ్బులు ఇవ్వటంతోపాటు.. పనులు, స్కీమ్‌ల పేరిట ఈ నియోజకవర్గంలో రూ.3 వేల కోట్లకుపైగా కుమ్మరించినట్లు రాజకీయ దుమారం చెలరేగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.03 కోట్ల మంది ఓటర్లున్నారు. హుజూరాబాద్​ లెక్కన పంచిపెట్టాలంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో పార్టీ రూ.15 వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందనే అంచనాలున్నాయి.

ఏ లీడర్.. ఎంత ఇచ్చిండు?
వచ్చే ఎన్నికలకు అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది?.. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఎలాంటి అభిప్రాయం ఉంది? అనేది తెలుసుకునేందుకు పీకే టీమ్ సర్వేలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నది. అందులో భాగంగానే ఓటర్లపై నోట్ల ప్రభావాన్ని అంచనా వేస్తుండటం ఆసక్తి రేపుతున్నది. జనరల్ ఎలక్షన్ నుంచి లోకల్ బాడీ ఎన్నికల దాకా ఏయే టైమ్‌లో ఎంత పంచారు.. ఏ లీడర్, ఎన్ని డబ్బులు ఇచ్చాడు.. అంటూ నేరుగా ఓటర్లను కలిసి వాకబు చేస్తున్నారు. డబ్బులతోపాటు ఖరీదైన కానుకలేమన్నా ఇచ్చారా అనేదీ తెలుసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఎంత మేరకు ఎన్నికల ఖర్చు పెరిగిపోతుందనే అంచనా వేసేందుకు పీకే టీమ్ ఈ వివరాలు సేకరిస్తున్నట్లుగా చర్చ జరుగుతున్నది.